రోడ్లపై రైతు నిరసనలతో ట్రాఫిక్ ఇబ్బందులు: పరిష్కారం కనుక్కోవాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలతో రహదారులు దిగ్భంధానికి గురవుతున్నాయని, ఇందుకు ఓ పరిష్కారం కనుగొనాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధానంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులతోపాటు హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది రైతులు గత ఏడాది నవంబర్ నుంచి మూడు ఢిల్లీ సరిహద్దు పాయింట్ల రహదారులపై నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.
గత సెప్టెంబర్ నెలలో కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ప్రతినిధులు, రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. కాగా, నొయిడాకు చెందిన ఓ వ్యక్తి.. రైతు నిరసనల కారణంగా తలెత్తిన రోడ్ల నిర్బంధాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారించింది.

ఈ రోడ్ల దిగ్బంధానికి పరిష్కారం కేంద్రం, రాష్ట్రం చేత్తులో ఉందని, నిరసనలు కొనసాగితూ పోతే ట్రాఫిక్ నియంత్రించలేమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల రాకపోకలకు అంతరాయం కలగరాదని సుప్రీంకోర్టు బెంచ్ ప్రిసైడింగ్ జడ్జీ ఎస్ కే కౌల్ వ్యాఖ్యానించారు.
'మీరు(కేంద్రం) ఎందుకు పరిష్కారం కనుగొనలేకపోతున్నారు. వాళ్ల(రైతులు)కు నిరసనలు చేసే హక్కు ఉంది కానీ, రాకపోలకలకు అంతరాయం కలిగించకూడదు' అని జస్టిస్ ఎస్కే కౌల్.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు స్పష్టం చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ కు వాయిదా వేశారు.
కాగా, రోడ్ల దిగ్బంధాలను ఏ విధంగా నియంత్రించవచ్చో అఫిడవిట్ దాఖలు చేయాలని గత జులై 19న జరిగిన విచారణలో ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలను బెంచ్ ఆదేశించింది. నిరసనల్లో భాగంగా రోడ్ల దిగ్బంధం చట్టవిరుద్ధమంటూ రైతులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇచ్చింది.
బీజేపీకి వ్యతిరేకంగా రైతు నేతలప్రచారం
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులు వచ్చే ఏడాది జరిగే ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. పశ్చిమబెంగాల్ తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం ప్రచారం చేసిన రైతులు.. ఇప్పుడు కీలక రాష్ట్రాల్లో బీజేపీని మట్టికరిపించడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ మిషన్ ఉత్తర్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ పేరుతో తమ తదుపరి కార్యక్రమాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ మూడు వ్యవసాయ చట్టాల్లో రైతులకు వ్యతిరేకంగా ఏమీ లేదని చెప్తున్నారని, కానీ అందులోని ఓ చట్టంలో రైతులు తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామాగ్రి కార్పోరేట్ సంస్ధల నుంచి కొనుగోలు చేయాలని చెప్తున్నాయని తికాయత్ మండిపడ్డారు. ఈ కొనుగోళ్ల కోసం రైతులు బ్యాంకులపై ఆధారపడాలని ఈ చట్టాలు చెబుతున్నాయన్నారు.
తాము ఇప్పటికే బెంగాల్లో బీజేపీని ఓడించామని, తమ తదుపరి లక్ష్యం ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలేనని రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. సెప్టెంబర్ 5న ముజఫరాబాద్ లో తమ తొలి మహా పంచాయతీ ఉంటుందని రాకేష్ తికాయత్ ప్రకటించారు. ఢిల్లీ తరహాలోనే త్వరలో లక్నో సరిహద్దుల చుట్టూ తాము మోహరిస్తామని తికాయత్ వెల్లడించారు. ఇందులో అన్ని రైతు సంఘాలు పాల్గొంటాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications