రాందేవ్ బాబాకు సుప్రీంలో ఊరట..! ఐఎంఏ కేసులో కీలక నిర్ణయం..!
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)తో సాగుతున్న పోరాటంలో యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థకు సుప్రీంకోర్టులో ఎట్టకేలకు ఊరట లభించింది. గతంలో అల్లోపతి మందుల్ని వాడొద్దని, తన పతంజలి ఉత్పత్తుల్నే వాడాలంటూ దేశవ్యాప్తంగా డాక్టర్లను తప్పుబట్టేలా పతంజలి రూపొందించిన యాడ్స్ పై ఐఎంఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఐఎంఏ పిటిషన్ పై పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు సందర్భాల్లో వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఇక ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు జారీ చేయకుండా విచారణను ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో పిటిషనర్లకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టుల్ని ఆశ్రయించవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఇప్పటికే తాము ఇచ్చిన పలు ఉత్తర్వుల వల్ల పిటిషనర్ల లక్ష్యం నెరవేరినట్లు భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే కేసు విచారణను ఇంతటితో ముగిస్తున్నట్లు తెలిపింది.

గతేడాది ఫిబ్రవరిలో ఐఎంఏ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాందేవ్ బాబాతో పాటు పతంజలి సంస్థ నడుపుతున్న ఆచార్య బాలకృష్ణపైనా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. అయితే వారు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో ఆ తర్వాత సుప్రీంకోర్టు వాటిని ఉపసంహరించుకుంది. కానీ కేసు మాత్రం ఇంకా కొనసాగుతోంది. దీంతో ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టులో పతంజలి సంస్థతో పాటు రాందేవ్ బాబాకూ ఊరట దక్కినట్లయింది.












Click it and Unblock the Notifications