జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలి: స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం 12వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్ మార్కుల అసెస్మెంట్ ను పూర్తి చేసి, జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. పది రోజుల్లోగా మూల్యాంకన విధానాన్ని రూపొందించి కోర్టుకు తెలియజేయాలని బోర్డులను ఆదేశించింది.
అయితే, బోర్డులన్నింటికీ ఏకరూప మ్యూల్యంకన విధానం ఉండేలా ఆదేశాలు ఇవ్వమన్న పిటిషన్లై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రతి బోర్డు స్యయం ప్రతిపత్తి కలిగివుంది, అందుకే బోర్డులు తమ సొంత మూల్యాంకన విధానాలను రూపొందించుకునే హక్కు ఉందని కోర్టు పేర్కొంది.

12వ తరగతి పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి జులై 31లోగా ఫలితాలను వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
సీబీఎస్ఈ, సీఐఎస్‌సీ బోర్డులకు కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా ఆదేశాలిచ్చింది. దీంతో ఆయా బోర్డులు కోర్టుకు తమ మూల్యాంకన విధానాన్ని తెలియజేశాయి. జులై 31లోగా 12వ తరగతి ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నాయి. కాగా, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఆరు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయి. ఏపీ ప్రభుత్వం పరీక్షలను నిర్వహిస్తామని తెలిపిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశంలోని చాలా బోర్డులు పరీక్షలను రద్దు చేశాయని, ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే.. ఏ ఒక్క విద్యార్ధి మరణించినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా విస్తరణ వేళ పరీక్షలకు హాజరయ్యో లక్షలాదిమంది విద్యార్ధులను ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించింది. పరీక్షలు నిర్వహించే సమయంలో థర్డ్ వేవ్ వస్తే ఏంచేస్తారని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంలో ఎక్కువ సమయం ఇవ్వలేమని, గురువారం సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications