Arvind Kejriwal: ఎన్నికల వేళ కేజ్రివాల్ కు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్..!
ఢిల్లీ మద్యం కేసులో మార్చి 21న ఈడీ అరెస్టు చేశాక తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడుపుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు ఎట్టకేలకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఆయన్ను ఢిల్లీ సీఎంగా తప్పించాలన్న పిటిషన్లను కోర్టులు తోసిపుచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు మరో కీలక సంకేతం ఇచ్చింది.
జాతీయ పార్టీ అధినేతగా ఉన్న తనను లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే మద్యం కేసులో అరెస్టు చేశారన్న కేజ్రివాల్ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇవాళ వెల్లడించింది. గతంలో ఇదే అంశంపై వాదనలు జరిగినా సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రం ఈ నెల 7న కేజ్రివాల్ బెయిల్ పై వాదనలు వినిపించేందుకు సిద్దంగా ఉండాలని ఆయన లాయర్ తో పాటు ఈడీని కూడా ఆదేశించింది.

ఈ లెక్కన మే 7న జరిగే విచారణలో కేజ్రివాల్ కు మధ్యంతర బెయిల్ లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో రెండు దశలు ముగిశాయి. మే 7న కేజ్రివాల్ కు బెయిల్ లభించే తదుపరి దశల్లో ఆయన ప్రచార బరిలోకి దిగేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో పాటు కేజ్రీ అరెస్టుతో డీలా పడిన క్యాడర్ లోనూ ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేజ్రివాల్ తో పాటు ఆప్ నేతలంతా మే 7న సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications