ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు ! ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు..
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ కేరళలోని కాసర్ గోడ్ లో నిర్వహించిన మాక్ పోలింగ్ లో ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ మేరకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అభ్యర్ధులకు చెందిన పోలింగ్ ఏజెంట్లు చేసిన ఫిర్యాదుపై ఈసీ విచారణకు సిద్దమవుతోంది. అదే సమయంలో దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు కావడంతో అత్యున్నత న్యాయస్ధానం తీవ్రంగా స్పందించింది.
కేరళలోని కాసర్ గోడ్ లోక్ సభ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఎన్నికల కోసం ఈసీ నిర్వహించిన మాక్ పోలింగ్ కోసం తెచ్చిన ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతోందని అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ పోలింగ్ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఈసీని తక్షణం ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇవాళ ఈవీఎం-వీవీ ప్యాట్ యంత్రాలపై దాఖలైన మరో పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

కేరళలోని కాసర్‌గోడ్ నియోజకవర్గంలో ఈవీఎంలపై నిర్వహించిన మాక్ పోల్స్‌కు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై మనోరమ ఆన్‌లైన్ పత్రిక ప్రచురించిన కథనాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మాక్ పోలింగ్ లో నాలుగు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు బీజేపీకి అనుకూలంగా అదనపు ఓట్లను తప్పుగా నమోదు చేశాయని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్ కు ఫిర్యాదు చేశాయని తెలిపారు.
అయితే ఈసీ తరఫున హాజరైన న్యాయవాది మాత్రం ఈ కథనం తప్పని తెలిపారు.












Click it and Unblock the Notifications