Sambhal: యూపీలోని సంభాల్ జామా మసీదుపై సుప్రీం కీలక ఆదేశాలు-సర్వేకు బ్రేక్..!
ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా ఐదుగురు మృతికి కారణమైన సంభాల్ లోని జామా మసీదు సర్వేకు సుప్రీంకోర్టు ఇవాళ బ్రేక్ వేసింది.
జామా మసీదుకు చెందిన షాహీ ఈద్గా కమిటీ హైకోర్టును ఆశ్రయించే వరకు మసీదు సర్వే కేసు విచారణను నిలిపేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఉన్న ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈ మసీదు సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుని ఆదేశించింది.
సంభాల్ లోని జామా మసీదును 1526లో బాబర్ చక్రవర్తి అక్కడ ఉన్న ఆలయాన్ని కూల్చి నిర్మించారన్న వాదనతో హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన స్దానిక కోర్టు.. సర్వేకు ఆదేశించింది. దీంతో సర్వేకు అధికారులు అక్కడికి వెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ స్దానికులు తీవ్ర నిరసనలు చేపట్టారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాల్లో ఐదుగురు చనిపోయారు. ఈ నేపథ్యంలో మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇవాళ ఈ పిటిషన్ పై సుప్రీం ఛీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు సర్వే నిర్వహించిన కమిషనర్ తమ నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ తెరవకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టులో ఈ వ్యవహారం తేలే వరకూ స్థానిక కోర్టు విచారణ ఆపాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై జనవరి మొదటి వారంలో విచారిస్తామని తెలిపింది.












Click it and Unblock the Notifications