Menstrual Leave: మహిళలకు పీరియడ్ సెలవులపై తేల్చేసిన సుప్రీంకోర్టు..! కీలక వ్యాఖ్యలు..!
ప్రతీ మహిళా తమ జీవితకాలంలో సగానికి పైగా ఎదుర్కొంటున్న సమస్య రుతుస్రావం. ముఖ్యంగా ఆఫీసుల్లో ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఇదో గండం. దీంతో ప్రతీ నెలా రుతుస్రావం సమయంలో వారికి సెలవులు (Menstrual Leave) ఇవ్వాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే వీటిని తప్పనిసరిగా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తమ నిర్ణయం ప్రకటించింది. ఇది సమాజంలో వాస్తవ పరిస్ధితికి అద్దం పట్టేలా ఉంది.
మహిళలకు తప్పనిసరి రుతుస్రావ సెలవులు వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని సుప్రీంకోర్టు ఇవాళ వ్యాఖ్యానించింది. ఎందుకంటే సంస్థల యజమానులు తాము అలాంటి చట్టం చేస్తే మహిళలను నియమించుకోరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పష్టం చేశారు. అటువంటి చట్టం శ్రామిక మహిళల్లో తాము పురుషుల కంటే తక్కువ అనే మానసిక భయాన్ని లేదా అభిప్రాయాన్ని కూడా సృష్టిస్తుందన్నారు.

రాష్ట్రాలు రుతు సెలవు నియమాలను రూపొందించాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. అవగాహన, సున్నితత్వాన్ని సృష్టించడం భిన్నంగా ఉంటుందని, కానీ మీరు రుతుస్రావ సెలవులను తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చిన వెంటనే, ఎవరూ మహిళలను నియమించుకోరని పిటిషనర్‌ను సీజేఐ హెచ్చరించారు. యజమానుల మనస్తత్వం మీకు తెలియదని, మేము అలాంటి చట్టం చేస్తే వారు మహిళలను నియమించుకోరని తేల్చిచెప్పేశారు.












Click it and Unblock the Notifications