సుప్రీంకోర్టు సంచలనం.. అసలైన శివసేన వారిదేనా?
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చేసిన వినతిని పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి ధర్మాసనం అనుమతినిచ్చింది. ఠాక్రే, షిండే వర్గాల్లో అసలైన శివసేన ఎవరిదనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
మహారాష్ట్ర శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో అప్పటివరకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ మద్దతుతో షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం తమదే అసలైన శివసేన అంటూ షిండే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు విల్లు-బాణం తమకే కేటాయించాలని కోరడాన్ని ఠాక్రే వర్గం వ్యతిరేకించింది.

రాజకీయ పార్టీలకు సంబంధించిన పలు వ్యవహారాల అంశాలపై సుప్రీంలో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, తర్వాతి చర్యలు తీసుకోకూడదంటూ ఠాక్రే ఈసీని కోరింది. అయితే ఠాక్రే అభ్యర్థనను ఈసీ పక్కన పెట్టింది. విల్లు-బాణం గుర్తు మీదే అనడానికి పత్రాలు సమర్పించాలని రెండు వర్గాలను ఈసీ ఆదేశించింది. శాసనసభా పక్షంతో పాటు పార్టీ సంస్థాగత విభాగ సభ్యుల మద్దతు లేఖలు కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఠాక్రే వర్గం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈసీ ప్రక్రియపై కోర్టు స్టే విధించింది. తాజాగా వచ్చిన తీర్పుతో ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.












Click it and Unblock the Notifications