కన్వర్ యాత్ర దారిలో షాపులపై యజమానుల పేర్లా ? సుప్రీం స్టే-మూడు రాష్ట్రాలకు నోటీసులు..!
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఏటా జరిగే కన్వర్ యాత్ర సందర్భంగా ఈ ఏడాది యాత్ర జరిగే మార్గంలో ఉండే అన్ని షాపులు తమ యజమానులు,అందులో పనిచేసే సిబ్బంది పేర్లు షాపులపై రాయాలని బీజేపీ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవాళ తాత్కాలికంగా పక్కనబెట్టింది. కన్వర్ యాత్ర జరిగే మార్గంలో షాపులపై యజమానులు, సిబ్బంది పేర్లను రాయాలంటూ పోలీసులు ఒత్తిడి తీసుకురావొద్దంటూ సుప్రీంకోర్టులో జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కన్వర్ యాత్ర కోసం అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల తర్వాత మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉజ్జయిని లోనూ ఇలాంటి ఉత్తర్వులే జారీ చేసింది. వీటిపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, ఎటువంటి చట్టం యొక్క అధికారం లేకుండా ఈ ఉత్తర్వు జారీ చేశారని, ఇది కేవలం జనాన్ని మభ్యపెట్టేందుకే అన్నారు.
రెస్టారెంట్లు, షాపులకు వాటి మెనూల్ని బట్టి వెళ్లాలని, సిబ్బందిని బట్టి కాదన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.

ఇరువైపులా వాదనలు ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలా కన్వర్ యాత్ర జరిగే మార్గంలో షాపులపై వాటి యజమానుల పేర్లు అడగటం సరికాదని అభిప్రాయపడింది. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతే కాదు ఇలా ఉత్తర్వులు జారీ చేసిన ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలని సూచించింది.












Click it and Unblock the Notifications