గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు : ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వం, ఏం చెయ్యాలి !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో తన సత్తాచాటి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ నిరాశ ఎదురౌయ్యింది. ఎన్నికల ప్రచారం చెయ్యడానికి తాము అనుమతి ఇవ్వలేమని శుక్రవారం సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు అయోమయంలో పడిపోయారు.

సోదరుడి కోసం
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బళ్లారి శాసన సభ నియోజక వర్గం నుంచి తన సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయన్ను గెలిపించుకోవడానికి బళ్లారి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టుకు మనవి చేశారు.

అనుమతి ఇవ్వలేం
గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు పరిశీలించింది. బళ్లారిలో సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి తరపున గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చెయ్యడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. బళ్లారి వెళ్లడానికి బలమైన కారణాలు లేవని అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది.

బళ్లారి జిల్లాలోకి నో ఎంట్రీ
అక్రమ గనుల కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి కొన్ని సంవత్సరాల తరువాత షరతులతో జామీను తీసుకుని బయటకు వచ్చారు. బళ్లారి జిల్లాలో అడుగు పెట్టకూడదని, సాక్షులను ప్రభావితం చెయ్యకూడదనే షరుతులతో సుప్రీం కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి జామీను మంజూరు చేసింది.

గాలి సోదరులు పోటీ
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బళ్లారి సిటీ నియోజక వర్గం నుంచి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి, మరో సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి పరపనహళ్ళి శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో ప్రాణ స్నేహితుడు శ్రీరాములు తరపున ప్రచారం చేస్తున్నారు.

గతంలో అనుమతి
గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పండగ జరుపుకోవడానికి, కుమార్తె విహహాం విషయంలో బళ్లారి వెళ్లడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే శాసన సభ ఎన్నికల సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లాలో అడుగుపెట్టడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!