NEET UG 2024: నీట్ పరీక్షలో లీకులు నిజమే..తేల్చేసిన సుప్రీంకోర్టు- కానీ రీటెస్ట్ కు నో..!
జాతీయ స్దాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024పై సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. నీట్ పరీక్షలో పేపర్ లీకులు సహా చోటు చేసుకున్న పలు అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇవాళ తన తీర్పు వెల్లడించింది. అయితే ఇందులో పేపర్ లీకులు నిజమేనని నిర్ధారించింది.

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో రీటెస్ట్ కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. బీహార్ లోని హజారీ బాగ్, పాట్నాలో మాత్రమే పేపర్ లీక్ అయిందని నిర్ధారించింది. కేవలం 155 మంది అభ్యర్ధులు మాత్రమే దీంతో లబ్ది పొందినట్లు గుర్తించామని సుప్రీంకోర్టు తెలిపింది. మద్రాస్ ఐఐటీతో చేయించిన అధ్యయనంలో ఇదే తేలిందన్నారు. దీన్ని సాకుగా చూపుతూ నీట్ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తే 24 లక్షల మందిపై ప్రభావం పడుతుందని తెలిపింది.
దేశమంతా నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు లేవని సీజే డీవై చంద్రచూడ్ తెలిపారు. పేపర్ లీక్ ద్వారా లబ్ది పొందిన అభ్యర్ధులపై మాత్రం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీట్ పరీక్ష నిర్వహణలో వ్యవస్థాగత లోపాలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరోవైపు నీట్ పరీక్షలో ఫిజిక్స్ ప్రశ్నకు సరైన సమాధానాన్ని తమకు అందించాలని సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. 44 మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ సాధించడానికి దారితీసిన ఎన్‌సిఇఆర్‌టి ప్రశ్నకు సమాధానమివ్వడానికి ఐఐటి-ఢిల్లీకి చెందిన ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ రిపోర్టు ప్రకారం ఆప్షన్ 4ను సరైన సమాధానంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications