కర్ణాటకకు సుప్రీం డెడ్ లైన్ : రేపు మధ్యాహ్నాం లోపు తేల్చాల్సిందే!
న్యూఢిల్లీ : తమిళనాడుకు నీళ్లు విడుదల చేయమంటూ సుప్రీం.. తీర్పును ఉల్లంఘిస్తూ కర్ణాటక.. ఇలా.. కర్ణాటక-తమిళనాడు మధ్య నెలకొన్న కావేరి జలవివాదం ఇప్పటికీ ఎటూ తెగని చందంగా తయారైంది. కాగా, తమిళనాడుకు నీటి విడుదలలో మొండికేస్తోన్న కర్ణాటకపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. ధర్మాసనం తీర్పును కర్ణాటక ధిక్కరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.

కోర్టు ఆదేశాలను ధిక్కరించడం మానుకోవాలని కర్ణాటకకు సూచించింది సుప్రీం. అలాగే తమిళనాడుకు కావేరి నీళ్లను విడుదల చేశారా? లేదా? అన్న అంశంపై మంగళవారం మధ్యాహ్నాం 2గం.ల వరకు స్పష్టత ఇవ్వాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వానికి చివరి డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు. ఇక కావేరి నదిలో నీటి లభ్యత విషయమై కేంద్రం కమిటీని ఏర్పాటు చేయాలని కర్ణాటక కోరుతున్నా.. పరిశీలక కమిటీ ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని సుప్రీంకు కేంద్రం తెలిపింది.
కాగా, కావేరి నుంచి తమిళనాడుకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని గత నెల సుప్రీం కర్ణాటకను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం తీర్పును ఇప్పటిదాకా ధిక్కరిస్తూ వస్తోన్న కర్ణాటకకు ఇదే చివరి అవకాశంగా సుప్రీం డెడ్ లైన్ విధించడంతో కర్ణాటక నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications