ప్రధాని మోడీ నోట సర్జికల్ స్ట్రైక్స్..ఎయిర్ స్ట్రైక్స్: శతృమూకకు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్.. ఎయిర్ స్ట్రైక్స్‌ను ప్రస్తావించారు. ఈ రెండూ దేశ రక్షణ వ్యవస్థ బలాన్ని, నైపుణ్యాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు. భారత్ బలహీనం కాదని, ప్రతీకారాన్ని తీర్చుకుంటుందనే హెచ్చరికలను శతృదేశాలకు పంపించినట్టయిందని అన్నారు. ఇది ఒకప్పటి భారత్ కాదని.. సరికొత్త భారత్ అనే విషయాన్ని శతృవులకు తెలియజేసేలా చేసిందని ప్రధాని స్పష్టం చేశారు. ఎలాంటి కఠిన నిర్ణయాలనైనా భారత్ తీసుకోగలుగుతుందనే సందేశాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

సర్జికల్ స్ట్రైక్స్..
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిలోని రెడ్ ఫోర్ట్ వద్ద ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2016లో జమ్మూ కాశ్మీర్‌లోని యూరీ సెక్టార్ సమీపంలో సరిహద్దులను దాటుకుని వెళ్లిన భారత సైనికులు.. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌ను నిర్వహించారు. దాని తరువాత 2019లో పుల్వామా జిల్లాలోని అవంతిపురా వద్ద సీఆర్పీఎఫ్ వాహనాలపై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్ భూభాగంలోని మిలిటెంట్ల స్థావరాలపై మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ రెండింటినీ మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

సరికొత్త భారత్..
శతృమూకలను అణచివేయడంలో ఎలాంటి, ఎంతటి కఠిన నిర్ణయాన్నయినా తీసుకోగలిగే సరికొత్త భారత్ ఇదేనని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపైనా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందులో భాగంగా- నేషనల్ హైడ్రోజన్ మిషన్‌ను అమలు చేయబోతోన్నట్లు ఆయన ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్, ఎక్స్‌పోర్ట్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు, కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే రూపొందిస్తామని అన్నారు.

తల్లిదండ్రుల వైఖరిని మార్చిన ఒలింపిక్స్..
టోక్యో ఒలింపిక్స్.. భారత్‌లో సరికొత్త క్రీడా విధానానికి నాంది పలికిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒకదశలో క్రీడలను వృధాగా పరిగణించే వారని, ఆటల వల్ల పిల్లలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో బలంగా ఉండేదని అన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. క్రీడలు, శరీర దారుఢ్యం, శారీరక ఆరోగ్యం.. వంటి అంశాల పట్ల దేశ ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కల్పించేలా చేయడంలో ఒలింపిక్స్ కీలక పాత్ర పోషించిందని అన్నారు.

టాలెంట్, టెక్నాలజీ..ప్రొఫెషనలిజం..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సాధించిన విజయాలు దేశ క్రీడారంగాన్ని మలుపు తిప్పుతాయని ప్రధాని వ్యాఖ్యానించారు. టాలెంట్, టెక్నాలజీ, ప్రొఫెషనలిజం.. దేశ క్రీడా రంగాన్ని మరింత వేగంగా ముందుకు నడిపిస్తాయని చెప్పారు. సీబీఎస్సీ బోర్డు పరీక్షల్లో గానీ.. టోక్యో ఒలింపిక్స్‌లో గానీ ఆడపిల్లలు అద్భుతంగా రాణించారని, తమ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. ఇదే వైఖరిని అన్ని రంగాల్లోనూ మహిళలు కనపర్చాలని, దీనికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని చెప్పారు.

ఎనర్జీ ఇండిపెండెంట్..
వచ్చే 25 సంవత్సరాల్లో భారత్‌ను ఇంధన రంగంలో స్వతంత్ర శక్తిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొనే సమయానికి ఈ రంగంలో భారత్ శక్తిమంతంగా ఎదుగుతుందనే ఆశాభావాన్ని ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా భారత్ అడుగులు వేస్తోందని పునరుద్ఘాటించారు. అదే సమయంలో వందశాతం ఎలక్ట్రిక్ రైళ్లను నడిపించేలా రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోందని అన్నారు. 2030 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తెస్లామని చెప్పారు.












Click it and Unblock the Notifications