H1N1: దేశంలో మళ్లీ స్వైన్ ఫ్లూ పంజా! జేపీ నడ్డా అత్యవసర సమీక్ష
దేశంలో వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో పాటు మారుతున్న ఉష్ణోగ్రతలు ప్రజారోగ్యానికి సవాలుగా మారాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉక్కపోత, తేమతో కూడిన వాతావరణం కారణంగా స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాధి పరిస్థితులు, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ఉన్నత స్థాయి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్‌తో పాటు పలువురు సీనియర్ వైద్యాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తీవ్ర నిఘా పెంచాలని కఠిన ఆదేశాలు
సమీక్షా సమావేశంలో భాగంగా దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్లు (ILI), తీవ్రమైన శ్వాసకోశ సమస్యల (SARI) ట్రెండ్స్‌ను మంత్రి నిశితంగా పరిశీలించారు. వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి ల్యాబ్ పరీక్షలు, నమూనాల సేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నడ్డా స్పష్టం చేశారు.

ఢిల్లీ ఆసుపత్రుల్లో బెడ్లు, మందులు సిద్ధం
హై-అలర్ట్‌లో ఉన్న రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సన్నద్ధతను ప్రత్యేకంగా సమీక్షించారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు అవసరమైన ఐసొలేషన్ వార్డులు, ఐసీయూ బెడ్లు, ప్రాణరక్షక మందులను సరిపడా అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ముందస్తు ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని ఆదేశించారు.
మారిన వాతావరణమే ప్రధాన కారణం
రాజధానిలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, అధిక తేమ శ్వాసకోశ సంబంధిత వైరస్‌లు వేగంగా వ్యాపించడానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్1ఎన్1 లేదా స్వైన్ ఫ్లూ అనేది ప్రాథమికంగా ఇన్ఫ్లుఎంజా ఏ రకానికి చెందిన వైరల్ ఇన్ఫెక్షన్. జ్వరం, తీవ్రమైన దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, చలి, నీరసం దీని ముఖ్య లక్షణాలు. చిన్నపిల్లలు, వృద్ధులు , ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వైరస్ బారినపడితే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు.
కేంద్రం, రాష్ట్రాల సమన్వయమే శ్రీరామరక్ష
ఏదైనా సీజనల్ వ్యాధులు విజృంభించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి నడ్డా ఉద్ఘాటించారు. గత జూలై నెలలో కూడా ఢిల్లీలో డెంగ్యూ నివారణ చర్యలపై సమీక్ష జరిపిన విషయాన్ని గుర్తుచేస్తూ... స్థానిక మున్సిపల్ అధికారులు, హెల్త్ కేర్ సిబ్బంది , ఫ్రంట్‌లైన్ వర్కర్లు అంతా సమన్వయంతో పనిచేస్తేనే స్వైన్ ఫ్లూను అరికట్టవచ్చని నడ్డా అభిప్రాయపడ్డారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.














Click it and Unblock the Notifications