నవంబర్‌లో సాయి పల్లవి బిగ్గెస్ట్ సర్ ప్రైజ్!
సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా సెలెక్టెడ్ స్టోరీలనే చేసే నటిగా సాయి పల్లవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఆమె రాబోయే సినిమాల విడుదల షెడ్యూల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే ఓ అరుదైన పరిస్థితిని తీసుకొచ్చింది. ఆమె నటిస్తున్న రెండు అతిపెద్ద ప్రాజెక్టులు కేవలం రెండు వారాల వ్యవధిలోనే థియేటర్లలోకి రాబోతుండటంతో వెండితెరపై సాయి పల్లవి బ్యాక్-టు-బ్యాక్ హవా కొనసాగనుంది.
రెండు వారాల వ్యవధిలోనే విడుదల
మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ మూవీ 'రామాయణ్' నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ధనుష్ సరసన ఆమె నటించిన తమిళ చిత్రం 'ఓం' నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ రెండు భారీ చిత్రాల విడుదల మధ్య కేవలం రెండు వారాల స్వల్ప వ్యవధి మాత్రమే ఉంది. ఒకే నెలలో అది రెండు వారాల తేడాతో సాయి పల్లవి సినిమాలు విడుదల కావడం ఆమె కెరీర్లోనే అత్యంత అరుదైన విషయంగా మారింది.

భారీ కాన్వాస్.. అగ్ర తారల కాంబినేషన్
ఈ రెండు సినిమాల స్థాయి, మార్కెట్ పరిధి చాలా పెద్దవి కావడం విశేషం. పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కుతున్న 'రామాయణ్' సినిమాలో రణబీర్ కపూర్, యష్ వంటి పాన్-ఇండియా స్టార్లతో కలిసి సాయి పల్లవి నటిస్తోంది. మరోవైపు 'ఓం' సినిమా ద్వారా ధనుష్‌తో కలిసి మరో పవర్‌ఫుల్ సౌత్ ఇండియన్ ప్రాజెక్టులో కనిపించనుంది. పాత్రల పరిధి, తోటి నటీనటులు, మార్కెట్ స్థాయి పరంగా ఈ రెండు చిత్రాలు ఆమె కెరీర్లో మైలురాయిగా నిలవనున్నాయి.
సాయి పల్లవి స్పీడ్ పెంచిందా?
వరుసగా సినిమాలు ఒప్పుకుని బిజీ అయిపోవాలనే ఉద్దేశంతో సాయి పల్లవి ఈ నిర్ణయం తీసుకోలేదు. ఆమె ఎంతో జాగ్రత్తగా ఎంచుకున్న రెండు విభిన్నమైన భారీ ప్రాజెక్టుల రిలీజ్ డేట్స్ అనుకోకుండా క్యాలెండర్‌లో ఒకే నెలలో పక్కపక్కనే వచ్చాయి. ఏది ఏమైనా రాబోయే నవంబర్ నెల సాయి పల్లవి అభిమానులకు, బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద విందుగా మారడమే కాకుండా నటిగా ఆమెకు అత్యంత ప్రత్యేకమైన నెలగా నిలవనుంది.














Click it and Unblock the Notifications
