ప్రకృతి సూత్రాలకే సవాల్ విసిరిన తాబేలు! బంగాళాఖాతం నుంచి అరేబియా కడలికి..
మానవ హద్దులకు సరిహద్దులు ఉంటాయేమో కానీ, ప్రకృతి సృష్టించిన జీవుల అన్వేషణకు హద్దులు ఉండవని ఒక చిన్న తాబేలు నిరూపించింది. సాధారణంగా సముద్రంలో జన్మించే 'ఆలివ్ రిడ్లే' జాతి తాబేళ్లు తాము ఏ తీరంలోనైతే గుడ్ల నుంచి బయటకు వస్తాయో, జీవితాంతం ఆ తీరంతోనే విడదీయరాని బంధాన్ని పెంచుకుంటాయి. ఎక్కడేక్కడో సంచరించినా గుడ్లు పెట్టే సమయానికి పక్కాగా పుట్టిన నేలకే చేరడం వాటి నైజం.
కానీ, ఒక అసాధారణ తాబేలు మాత్రం దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న ఈ జీవన సూత్రాన్ని తలకిందులు చేసింది. తూర్పు కడలి నుంచి పయనం ప్రారంభించి, భారత ద్వీపకల్పాన్ని చుట్టేస్తూ అరేబియా సముద్రంలోకి అడుగుపెట్టింది. అక్షరాలా 3,500 కిలోమీటర్ల మేర సాగిన ఈ అలసిపోని యాత్ర.. పర్యావరణ శాస్త్రవేత్తలనే విస్తుపోయేలా చేసింది.

1400 రోజుల ప్రయాణం
ఈ వినూత్న రికార్డు వెనుక ఒక ఆసక్తికరమైన సైంటిఫిక్ స్టోరీ ఉంది. సముద్ర జీవుల వలసల తీరును అధ్యయనం చేసే క్రమంలో 2021 మార్చిలో ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ వద్ద ఒక ఆడ తాబేలుకు ఎలక్ట్రానిక్ ట్యాగ్ బిగించి నీటిలోకి వదిలారు. సాధారణంగా ఈ రీజియన్‌లోని తాబేళ్లు ఆహారం కోసం శ్రీలంక దాకా వెళ్లడం, మళ్లీ సంతానోత్పత్తి సమయానికి ఒడిశా తీరానికే తిరిగొచ్చెయ్యడం ఆనవాయితీ.
కానీ ఈ ప్రత్యేక తాబేలు శ్రీలంక దగ్గర ఆగలేదు. పశ్చిమ తీరం వైపు పయనిస్తూ పాక్ జలసంధి గుండా అరేబియా సముద్రంలోకి దూసుకెళ్లింది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత (2025 జనవరిలో) మహారాష్ట్రలోని గుహాఘర్ బీచ్‌లో గుడ్లు పెడుతుండగా వైల్డ్‌లైఫ్ సిబ్బంది కంటపడటంతో ఈ అరుదైన మహా ప్రయాణం వెలుగులోకి వచ్చింది.
సముద్రపు ప్రవాహాలు.. అయస్కాంత సంకేతాల కిటుకు!
పాక్ జలసంధి, మన్నార్ సింధుశాఖలు తాబేళ్ల ప్రయాణానికి దాటలేని అడ్డంకులని ఇన్నాళ్లూ భావించేవారు. మరి ఈ ఒక్క తాబేలు ఆ అవరోధాలను ఎలా అధిగమించిందనే దానికి నిపుణులు ప్రధానంగా మూడు కీలక కారణాలను ఎత్తిచూపుతున్నారు:
మొదటిగా శీతాకాలంలో సంభవించే ఈశాన్య రుతుపవన ప్రవాహాలు ఈ జీవిని అరేబియా సముద్రం వైపు వేగంగా నెట్టాయి. అనంతరం పశ్చిమ తీరంలో లభించే సమృద్ధియైన పోషకాహారం కోసం ఇది సాగించిన ప్రయాణంలో బలమైన నీటి ప్రవాహాలు దీనిని మరింత ముందుకు సాగనంపాయి. చివరిగా తాబేళ్ల శరీరంలో ఉండే సహజ సిద్ధమైన మ్యాగ్నెటిక్ నావిగేషన్ వ్యవస్థ వీటికి సరైన దిశానిర్దేశం చేసి తీరానికి చేర్చి ఉండవచ్చని చెబుతున్నారు.
మారనున్న పర్యావరణ సంరక్షణ వ్యూహాలు
భారతదేశపు తూర్పు, పశ్చిమ తీరాల మధ్య తాబేళ్లకు అసలు సంబంధమే ఉండదనే పాత సిద్ధాంతానికి ఈ ఘటనతో తెరపడింది. బంగాళాఖాతం - అరేబియా సముద్రాల మధ్య బలమైన జీవావరణ బంధం ఉందనే విషయాన్ని 'ఇన్ కాయిస్' (INCOIS) శాస్త్రవేత్తల సమగ్ర నివేదిక స్పష్టం చేసింది. దీనివల్ల ఇకపై తాబేళ్ల సంరక్షణను కేవలం ఒకే తీరానికి లేదా ఒక రాష్ట్ర సరిహద్దులకే పరిమితం చేయకుండా, ఉమ్మడి జాతీయ విధానాన్ని పాటించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.














Click it and Unblock the Notifications
