హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో టీ20, హైదరాబాద్‌కు దక్కని అవకాశం - ప్రెస్‌రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వైజాగ్ స్టేడియం

వచ్చే ఎనిమిది నెలల్లో స్వదేశంలో టీమ్‌ఇండియా ఆడే అంతర్జాతీయ సిరీస్‌లకు సోమవారం బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేసిందని, అందులో భాగంగా ఓ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని విశాఖపట్నం దక్కించుకుందని ఈనాడు తన కథనంలో తెలిపింది.

''వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న వెస్టిండీస్‌తో రెండో టీ20 విశాఖలో జరుగుతుంది. హైదరాబాద్‌కు మాత్రం నిరాశే మిగిలింది. ఉప్పల్‌ స్టేడియానికి అవకాశం దక్కలేదు.

భవిష్యత్‌ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది నవంబర్‌ నుంచి 2022 జూన్‌ మధ్యలో సొంతగడ్డపై భారత్‌ 14 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు కలిపి మొత్తం 21 మ్యాచ్‌లు ఆడనుంది.

కానీ అందులో ఒక్క మ్యాచ్‌కూ హైదరాబాద్‌ వేదిక కాదు. అందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లోని అంతర్గత కుమ్ములాటలే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రెండు వర్గాలుగా చీలిపోయిన హెచ్‌సీఏ పాలకవర్గం విభేదాలతో ఇప్పటికే హైదరాబాద్‌ అబాసుపాలైంది.

ఈ ఏడాది ఐపీఎల్‌ 14వ సీజన్‌ మ్యాచ్‌ల వేదికల్లోనూ హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఇక ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయంలోనూ నిరాశ తప్పలేదు.

ఇక టెస్టులకు కాన్పూర్‌, ముంబయి, బెంగళూరు, మొహాలీ.. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు జైపుర్‌, రాంచి, లఖ్‌నవూ, విశాఖ, కోల్‌కతా, అహ్మదాబాద్‌, కటక్‌, త్రివేండ్రం, చెన్నై, రాజ్‌కోట్‌, దిల్లీ ఆతిథ్యమిస్తాయి.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో.. పొట్టి ఫార్మాట్‌పైనే బీసీసీఐ ఎక్కువగా దృష్టి పెట్టింద’’ని ఆ కథనంలో రాశారు.

టీమ్‌ఇండియా షెడ్యూల్

న్యూజిలాండ్‌తో మూడు టీ20లు (నవంబరు 17, 19, 21వ తేదీల్లో), రెండు టెస్టులు (నవంబరు 25-29, డిసెంబరు 3-7)

వెస్టిండీస్‌తో మూడు వన్డేలు (ఫిబ్రవరి 6, 9, 12), మూడు టీ20లు (ఫిబ్రవరి 15, 18, 21)

శ్రీలంకతో రెండు టెస్టులు (ఫిబ్రవరి 25-మార్చి1, మార్చి 5-9), మూడు టీ20లు (మార్చి 13, 15, 18)

దక్షిణాఫ్రికాతో అయిదు టీ20లు (జూన్‌ 9, 12, 14, 17, 19)

మధ్యలో డిసెంబర్‌ నుంచి జనవరి వరకూ దక్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియా పర్యటిస్తుంది. ఏప్రిల్‌ నుంచి మే వరకు ఐపీఎల్‌ 15వ సీజన్‌ జరిగే అవకాశాలున్నాయి.

ఎమ్మెస్సీ చదివి స్వీపర్ ఉద్యోగం చేస్తున్న రజనికి మంచి ఉద్యోగం ఇప్పించిన కేటీఆర్

ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ ఫస్ట్‌ క్లాసులో పాసై జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజనికి అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ మున్సిపల్‌ శాఖను ఆదేశించారని 'నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

''ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన రజనిని అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా నియమిస్తూ సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. రజని ప్రగతిభవన్‌లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌లను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

రజని ఎమ్మెస్సీ ఫస్ట్‌ క్లాసులో పాసై పీహెచ్‌డీ చేద్దామని అనుకుంటుంటే పెద్దలు పెండ్లి చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. అటు చదువులో ముందుకు సాగుదామనుకుంటే కుదరలేదు. ఇటు ఉద్యోగ ప్రయత్నాలూ కలిసిరాలేదు. దానికి తోడు భర్త అనారోగ్యంతో సంసార బాధ్యతలు మీదపడ్డాయి. పిల్లలను బడిలో చదివించాలన్నా డబ్బులకు ఇబ్బంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె స్వీపరు ఉద్యోగంలో చేరారు. క్లుప్తంగా ఇదీ రజని కథ.

అంచెలంచెలుగా చదువు లో ఎదుగుతూ అధ్యాపకుల ప్రశంసలు అందుకున్న రజనికి సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అర్హత కూడా వచ్చింది. కానీ కుటుంబ భారం ఆపేసింది. భర్తకు చిన్న వయసులోనే గుండెజబ్బు రావడం, స్టెంట్లు వేయడంతో ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

రజని ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నాలేవీ సక్సెస్‌ కాలేదు. మాల్స్‌ వంటివాటిలో రోజువారీ పని వెతుక్కుందామన్నా కరోనా కల్లోలంతో అదీ కుదరలేదు. చివరకు పదివేల జీతానికి కాంట్రాక్టు స్వీపరు ఉద్యోగంలో చేరారు. అందులో రెండు వేలకు పైగా రాకపోకలకే ఖర్చవుతుంది.

ఆమె నిస్సహాయ పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆమె విద్యార్హతలకు అనుగుణంగా ఆమె స్వీపరుగా పనిచేస్తున్న జీహెచ్‌ఎంసీలోనే అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా ఉద్యోగం ఇప్పించార’’ని పత్రిక తెలిపింది.

ఆహార భద్రత ఇండెక్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాలూ వీక్ కేటగిరీలోనే..

కేంద్రం తాజాగా వెల్లడించిన ఫుడ్‌ సేఫ్టీ ఇండెక్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాలూ 'బలహీనం’ (వీక్‌) కేటగిరీలో నిలిచాయని ఆధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

''తెలంగాణ నూటికి 40 మార్కులు సాధించగా.. ఏపీ కొంచెం మెరుగ్గా 57 మార్కులు పొందింది.

60 మార్కులకు దిగువన ఉన్న రాష్ట్రాలను ఎఫ్‌ఎస్ఎస్ఏఐ.. ఫుడ్‌ సేఫ్టీలో 'వీక్‌ కేటగిరీ’ రాష్ట్రాలుగా ప్రకటించింది. ఈ కేటగిరీలో 24 రాష్ట్రాలు నిలిచాయి.

మొత్తం ఐదు విభాగాల్లో ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్రాలకు మార్కులు కేటాయించగా.. అందులో తెలంగాణ రెండు విభాగాల్లో పూర్తిగా వెనకబడింది. దీంతో.. స్థానమూ దిగజారింది.

దీనిపై స్పందించిన తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ డైరెక్టర్‌ కే శంకర్‌.. మార్కులు తగ్గినా.. తాము సానుకూల దృక్పథంతోనే ముందుకు వెళతామని, సిబ్బందికి శిక్షణ ఇప్పించడం ద్వారా భవిష్యత్తులో ర్యాంకును మెరుగుపరుచుకునేందుకు యత్నిస్తామని తెలిపారు.

కాగా, ఫుడ్‌ సేఫ్టీ ఇండెక్స్‌లో గుజరాత్‌ తొలిస్థానంలో నిలవగా.. కేరళ, తమిళనాడు ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి.

ఇక చిన్న రాష్ట్రాల కేటగిరీలో గోవా తొలి స్థానంలో నిలవగా.. మేఘాలయా, మణిపూర్‌లకు ఆ తర్వాతి స్థానాలు దక్కాయి. అలాగే, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. జమ్మూ కశ్మీర్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఢిల్లీ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఎఫ్‌ఎస్ఎస్ఏఐ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం ఈ ఫలితాలు విడుదల చేశార’’ని ఆ కథనంలో తెలిపారు.

GETTY IMAGES

సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయంపై ఏకాభిప్రాయం

సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయంపై సినీ పరిశ్రమ ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందని సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెడతామన్నారని సాక్షి పత్రిక తెలిపింది.

''సోమవారం సచివాలయం నాలుగో బ్లాకులో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం–2002 నుంచి అమలుకు నోచుకోలేదన్నారు. తమ ప్రభుత్వం దీనిపై వివిధ కమిటీలను నియమించి విస్తృతంగా అధ్యయనం చేస్తోందని వివరించారు. ఇందులో భాగంగానే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ప్రతినిధులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టేక్‌ హోల్డర్లతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నట్టు చెప్పారు.

ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయంపై అందరూ ఏకాభ్రిపాయం వ్యక్తం చేయడంతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారన్నారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి సమావేశంలో వివరించామని, వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సినిమాపై తమ ఇష్టాన్ని ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన టికెట్‌ ధరల ప్రకారం ప్రజలకు వినోదం అందిస్తామన్నారు.

చాలా వరకు థియేటర్లలో ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయిస్తున్నారని, త్వరలో అన్ని థియేటర్లలో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ఏపీ సినిమా చిత్రీకరణకు అవసరమైన మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రతినిధుల బృందం ప్రభుత్వానికి చేసిన సూచనలను పరిశీలిస్తామన్నార’’ని ఆ కథనంలో వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
T20 in Visakhapatnam, while Hyderabad is not in the race
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X