తమిళ చానెళ్లు, సినిమాలకు బ్రేక్: టీఎన్ కనపడితే అంతే
బెంగళూరు: కావేరీ నీరు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ కన్నడ సంఘాలు చేపట్టిన కర్ణాటక బంద్ కు ఎక్కడ లేని మద్దతు వచ్చింది. బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, మండ్య, చిక్కబళ్లాపుర, కోలారు, తుమకూరు, చామరాజనగర తదితర జిల్లాల్లో బంద్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.
కన్నడ సంఘాలతో పాటు, రైతు సంఘాలు, కన్నడ సినిమా రంగం, కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ, ఆటో, ట్యాక్సీ, లారీ యజమానులు, కార్మిక, హోటల్ తదితర 1,200 సంఘాలు బంద్ కు మద్దతు ఇస్తున్నాయి.
శుక్రవారం (ఈనెల 9వ తేది) కర్ణాటకలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. బంద్ ను ప్రశాంతంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనకు పాల్పడరాదని ఆయన మనవి చేశారు.

కావేరి జలాలు బెంగళూరు నగర ప్రజలకు తాగు నీరు. అందు వలన బెంగళూరు నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తారని తెలుసుకున్న ఐటీ, బీటీ, కార్పొరేట్ సంస్థలు శుక్రవారం తమ కంపెనీలకు సెలవు ప్రకటించారు.
ఉద్యోగులు బయటకు రాకూడదని సూచించారు. తమిళనాడు వాహనాలు కర్ణాటకలోకి రాకుండా పోలీసులు గురువారం నుంచే జాగ్రత్తలు తీసుకున్నారు. కర్ణాటకలో తమిళనాడు రిజిస్ట్రేషన్ తో సంచరిస్తున్న ప్రజలు వారి వాహనాలు బయటకు తీసురాకూడదని పోలీసులు సూచించారు.
తమిళ చానెళ్లు టీవీల్లో ప్రసారం చెయ్యరాదని కేబుల్ ఆపరేటర్లు నిర్ణయించారు. తమిళ సినిమాలు ప్రదర్శిస్తున్న సినిమా హాల్స్ లోని తమిళ సినిమా పోస్టర్లు పూర్తిగా మూసివేశారు. తమిళనాడు వాహనాలు బెంగళూరులోకి రాకూండా అత్తిబెలె శివార్లలోనే అడ్డుకున్నారు.
బెంగళూరు నగరంలో తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో సాయుధ బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు శుక్రవారం కర్ణాటకాకు రావద్దని ప్రభుత్వం మనవి చేసింది.












Click it and Unblock the Notifications