జయ ఆరోగ్యం: కరుణానిధి సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్వహిస్తున్న శాఖలను ఆర్థిక శాఖా మంత్రి పన్నీర్ సెల్వంకు అప్పగించడంపై డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పన్నీర్ సెల్వంకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలోని అంశాలపై కరుణానిధి విస్మయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కరుణానిధి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సూచన మేరకు ఆర్థిక శాఖా మంత్రి పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు ఇస్తున్నామని ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే గత 20 రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను దూరంగానైనా చూడటానికి ఏ ఒక్కరిని అనుమితంచడం లేదని కరుణానిధి చెప్పారు. అలాంటిది సీఎం జయలలిత సూచన మేరకు పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించామని ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు.
ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు విడుదల చేసిన ప్రకటన చదివిన ఏ ఒక్కరికైనా సందేహాలు వస్తాయని కరుణానిధి అన్నారు. ఇప్పటికే సీఎం జయలలితను పలువురు పెద్దలు పరామర్శించారని కరుణానిధి చెప్పారు.
తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ సహా ఇతరులు ఎవ్వరూ జయలలితను చూడలేదని కరుణానిధి ఆరోపించారు.
ఈ నాయకులు అందరూ కేవలం డాక్టర్లతో మాట్లాడారని, జయలలిత ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లారని కరుణానిధి అన్నారు. సీఎం ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వాలని తాను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నానని కరుణానిధి గుర్తు చేశారు. కరుణానిధి సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో అన్నాడీఎంకే నాయకులు ఆయన మీద మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications