డీఎంకేకు చక్రబంధం: తమిళనాడులో మెరుపు సోదాలు
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష డీఎంకేకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ నివాసాలపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగం అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నై మైలాపూర్ తో పాటు తిరుచిరాపల్లి థిల్లయ్ నగర్‌లో ఉన్న ఆయన నివాసాలపై ఏకకాలంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఆయనకు చెందిన కార్యాలయాలు, ఇతర ప్రాంగణాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా శాఖలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో డీవీఏసీ ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే డీఎంకే శ్రేణులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వెలుపల గుమిగూడారు. డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళి కూడా నెహ్రూ నివాసానికి చేరుకున్నారు. దీంతో మైలాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

డీఎంకే ప్రభుత్వంలో నెహ్రూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. మొన్నటి ఎన్నికల్లో తిరుచిరాపల్లి వెస్ట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తన హయాంలో జరిగిన పలు నియామకాలు, కాంట్రాక్టుల కేటాయింపులు, బదిలీలలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దాదాపు రూ. 888 కోట్ల మేర క్యాష్ ఫర్ జాబ్స్ కుంభకోణం చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అర్హత లేని అభ్యర్థుల నుంచి కూడా భారీగా వసూళ్లకు పాల్పడ్డారని డీవీఏసీ అంచనావేస్తోంది.
దీంతో పాటు సుమారు రూ. 1,020 కోట్ల విలువైన వేర్వేరు విభాగాల కాంట్రాక్టుల కేటాయింపులలో కూడా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు ఇదివరకే ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకే డీవీఏసీ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. కేఎన్ నెహ్రూ, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, ఆయన ప్రాతినిథ్యం వహించిన శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను కూడా ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా చేర్చారు.
బదిలీలు, అధికారిక పోస్టింగ్‌ల వెనుక కూడా కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సేకరించిన కీలక ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి బదిలీ చేయడంతోనే ఈ ఆర్థిక అక్రమాల గుట్టు రట్టయింది. తమిళనాడులో అధికార పార్టీకి చెందిన అత్యంత కీలక నేతపై ఇటువంటి ఆరోపణలు రావడం రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
VIDEO | Chennai: Anti-corruption bureau conducts searches at former Minister KN Nehru's residence in Mylapore.
— Press Trust of India (@PTI_News) September 5, 2026
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/29dIAnp85J














Click it and Unblock the Notifications