ఏపీ మీదుగా మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు- రూట్ ఇదే
త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వం వరాలను కురిపించింది. కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించింది. తమిళనాడు నుంచి ఏపీ మీదుగా పశ్చిమ బెంగాల్ వరకు రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ కీలక నిర్ణయం దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల మధ్య దూర రైలు అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రైల్వే శాఖ తెలిపింది.
ఈ మూడింట్లో ఒకటి.. తిరుచిరాపల్లి నుండి పశ్చిమ బెంగాల్ లోని న్యూ జల్ పాయ్ గురి మధ్య నడుస్తుంది. తంజావూరు, కుంభకోణం, మైలాడుథురై, చిదంబరం, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మోర్, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్‌పూర్ వంటి స్టేషన్ల మీదుగా ఈ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది.

రెండో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. తాంబరం నుండి సంత్రాగచ్చి మధ్య అందుబాటులోకి వస్తుంది. చెన్నై ఎగ్మోర్, విజయవాడ, భువనేశ్వర్, ఖరగ్‌పూర్ వంటి ప్రధాన జంక్షన్లలో ఆగుతుంది. దక్షిణాది నుంచి పశ్చిమ బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ప్రయాణించే వారికి ఇది మరిం మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందని రైల్వే మంత్రి పేర్కొంది.
మూడో ఎక్స్ ప్రెస్ కు ఓ ప్రాముఖ్యత ఉంది. రైల్వే నెట్‌వర్క్‌లోని అత్యంత పొడవైన మార్గాలలో ఒకటిగా నిలుస్తుంది. తమిళనాడు చిట్టచివర ఉన్న నాగర్‌కోయిల్- న్యూ జల్ పాయ్ గురిని కనెక్ట్ చేస్తుందీ రైలు. తిరునల్వేలి, కోవిల్‌పట్టి, సత్తూరు, విరుధునగర్, మధురై, దిండిగల్, పళని, ఉడుమాల్ పేట, పొల్లాచ్చి, కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్‌పూర్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
రైల్వే వర్గాల సమాచారం ప్రకారం- ఈ మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, ఒకటి లేదా రెండు వందే భారత్ రైళ్లతో సహా మరికొన్ని కొత్త సర్వీస్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ప్రారంభించనున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అత్యాధునిక రైలు ప్రయాణ సౌకర్యాలను కల్పించినట్టవుతుందని రైల్వే శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications