నీట్ పరీక్షపై సుప్రీంలో పిటిషన్ వేసిన అనిత ఆత్మహత్య: రజినీకాంత్ దిగ్భ్రాంతి
చెన్నై: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తమిళనాడుకు చెందిన దళిత విద్యార్థిని అనిత(17) ఆత్మహత్యకు పాల్పడింది. అరియలూర్ జిల్లాలోని తన ఇంట్లోనే విగత జీవిగా కనిపించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళనాడు బోర్డు నిర్వహించిన 12వ తరగతి తుది పరీక్షల్లో 1200 మార్కులకు గానూ అనిత 1176 మార్కులు సాధించింది.
కానీ, నీట్ పరీక్షలో అర్హత సాధించలేకపోయింది. మెడిసిన్ చేయడానికి నీట్‌ను తప్పని సరిచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల తన లాంటి విద్యార్థులు చాలా మంది నష్టపోతున్నారని, తమిళనాడు బోర్డు పరిధిలో విద్యనభ్యసించిన వారికి ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది.

కాగా, ఇటీవల సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించలేదన్న బాధతోనే అనిత ఆత్మహత్మ హత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అనిత మృతి పట్ల ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు.
ఇలా జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించినట్లు తెలిపారు. తమిళనాడు సీఎం ఎడప్పడి పళనిస్వామి కూడా అనిత ఆత్మహత్య పట్ల విచారం వ్యక్తం చేశారు. అనిత కుటుంబానికి రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. కాగా, కొన్నేళ్ల క్రితం తమిళనాడులో వైద్యవిద్యకు ప్రవేశపరీక్షను ఎత్తివేశారు. మెరిట్ ఆధారంగానే సీట్లను కేటాయించే విధానం ఉండేది.












Click it and Unblock the Notifications