Tamil Nadu: తమిళనాడులో రిజిస్ట్రేషన్లు ఇకపై ఇలా..! విజయ్ కీలక నిర్ణయం..!
తమిళనాడు (Tamil Nadu)లో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ (Vijay).. పాలనలో అప్పుడే తన మార్కు చూపిస్తున్నారు. ముఖ్యంగా పాలనా సంస్కరణల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇదే క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ఉన్న ఇబ్బందుల్ని తప్పిస్తూ, ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా విజయ్ సర్కార్ ఇవాళ కీలక ప్రకటన చేసింది.
తమిళనాడులో ఎక్కడి నుంచి అయినా ఆన్ లైన్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ (Anywhere registration) చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఆగస్టు 17 నుంచి కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలనలో పారదర్శకత పెంచడం, ప్రజలకు సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రజలు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఎక్కడి నుంచిైనా 24 గంటలూ ఆన్‌లైన్‌లో పత్రాలను సమర్పించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి డి.లోగేష్ తమిళ్‌సెల్వన్ ఉన్నతస్థాయి పనితీరు సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం మే 10న బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో లంచగొండితనాన్ని పూర్తిగా నిర్మూలించి, సంపూర్ణ పారదర్శకతను తీసుకురావడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు రిజిస్ట్రే్షన్ కార్యాలయాల్లో సరైన కూర్చునే సౌకర్యం కల్పించాలని, వారి ఫిర్యాదులను శ్రద్ధగా పరిష్కరించాలని, అవినీతికి తావులేకుండా చూడాలని, పత్రాలను వెంటనే ప్రాసెస్ చేసి అదే రోజున సంబంధిత వ్యక్తులకు తిరిగి అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయం స్థలం లేదా అపార్ట్ మెంట్ ప్లాట్ తొలి విక్రయానికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో ప్రత్యేక లాగిన్‌లు, పత్రాల అప్‌లోడ్, బయోమెట్రిక్ ధృవీకరణ, ఆన్‌లైన్ చెల్లింపులు, దరఖాస్తు దాఖలు, వివరణలు కోరే సదుపాయం, డిజిటల్ డెలివరీ, నమోదైన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం, చట్టబద్ధత, హెల్ప్‌డెస్క్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ సేవను వాడుకోవాలంటే హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, ప్రభుత్వం అనుమతించిన ఎల్0, ఎల్ 1 ఫింగర్‌ప్రింట్ స్కానర్లు, అలాగే ఐరిస్ స్కానింగ్ పరికరాలు అవసరమని తెలిపింది. దీంతో ప్రధాన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై రద్దీ తగ్గుతుందని, పనిభారం అన్ని కార్యాలయాలకు సమానంగా పంపిణీ అవుతుందని, వేచి ఉండే సమయం తగ్గడంతో పాటు రిజిస్ట్రేషన్ సేవల నాణ్యత, సామర్థ్యం, వేగం మరింత మెరుగుపడుతాయని మంత్రి తెలిపారు.














Click it and Unblock the Notifications