తమిళనాడు గవర్నర్ పై డీఎంకే నేత తీవ్ర వ్యాఖ్యలు-క్రిమినల్ కేసుకు ఫిర్యాదు-పట్టించుకోని స్టాలిన్..
తమిళనాడులో గవర్నర్ బీఎన్ రవికీ, డీఎంకే ప్రభుత్వానికీ మధ్య పోరు రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం చదవకుండా అందులో కొన్ని పేరాలు వదిలేసిన గవర్నర్ బీఎన్ రవి చర్యపై మండిపడుతున్న ప్రభుత్వం, డీఎంకే నేతలు ఆయన్ను నిత్యం టార్గెట్ చేస్తున్నారు. గెటౌట్ రవి పేరుతో ఫ్లెక్సీలు, పోస్టర్లు పెట్టారు. దీంతో తమిళనాడు ప్రభుత్వ లోగో లేకుండానే గవర్నర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో డీఎంకే నేత ఒకరు తాజాగా గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ బీఎన్ రవి తీరుపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే మీరు గవర్నర్ అయ్యారని, ఆ రాజ్యాంగం రాసిన మా పూర్వీకుడు అంబేద్కర్ పేరు పలకడం ఇష్టం లేకపోతే కశ్మీర్ వెళ్లిపోండి. అక్కడికి తీవ్రవాదుల్ని పంపిస్తాం, వారు మిమ్మల్ని కాల్చిపారేస్తారంటూ డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో ఈ వ్యాఖ్యలు చేసిన శివాజీపై క్రిమినల్ చర్యలు కోరుతూ రాజ్ భవన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమిళనాడు గవర్నర్‌ను కించపరచేలా, బెదిరింపులతో కూడిన పదజాలాన్ని డీఎంకే నేత వాడినట్టు చెన్నై పోలీసు కమిషనర్ రాసిన లేఖలో గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ తెలిపారు. డీఎంకే నేత ప్రసంగం 1970, ఐపీసీ పీనల్ కోడ్ సెక్షన్ 124 కిందకు వస్తుందని, దీనికి తోడు సంబంధిత సెక్షన్లను కూడా పరిగణనలోకి తీసుకుని సాధ్యమైనంత త్వరగా ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పోలీసులు మాత్రం దీనిపై స్పందించలేదు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేతను అరెస్టు చేయలేదంటే, ఆయనకు సీఎం స్టాలిన్ మద్దతు ఉన్నట్లేనని వారు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications