తాంత్రికుడూ పార్ట్‌నర్: మోడీ సెటైర్, నితీష్‌వైపు మమత
పాట్నా: బీహార్‌ను, రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ప్రజాస్వామ్యం చాలునని, ఏ తాంత్రికత అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. బీహార్ ఎన్నికల వేళ జేడీయూ నేత నితీష్ కుమార్ ఓ తాంత్రికుడిని కలిసిన వీడియో హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే.
దీనికి ప్రధాని మోడీ పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. బీహార్ అభివృద్ధికి ప్రజలు ఈ ఎన్నికల్లో పాలుపంచుకోవడం చాలా కీలకమని చెప్పారు. ప్రధాని మోడీ నలంద జిల్లాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మహా కూటమి పైన నిప్పులు చెరిగారు.
మహా కూటమీలో లాలూ, నితీష్, సోనియా ముగ్గురు స్వార్థపరులున్నారని విమర్శించారు. బీహార్ ఎన్నికల్లో మహా కూటమికి తాంత్రికుడు నాలుగో పార్ట్‌నర్ అని ఎద్దేవా చేశారు. గతంలో వారు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. బీహార్ అభివృద్ధి చెందాలంటే మూడు సూత్రాల కార్యక్రమం అవసరమన్నారు.
విద్యుత్, నీరు, రోడ్లు అభివృద్ధి చెందడం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. ఉపాధి కోసం బీహార్ యువత వలసలు వెళ్లడాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం స్థానికంగానే ఉద్యోగితను పెంచాలన్నారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.
లాలు, నితీష్‌లకు అభివృద్ధిపై శ్రద్ధ లేదన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నితీష్ ఏడు సంకల్పాలు ప్రకటించగా.. మోడీ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధికి మూడు సూత్రాలు అని.. విద్యుత్, రోడ్డు, నీరు అన్నారు. అలాగే, యువత, వృద్ధుల కోసం చదువు, యువతకు ఉపాధి, వృద్దులకు ఆరోగ్యం, వైద్యం పేరిట మరో పథకాన్ని ప్రకటించారు.

వ్యూహాత్మక మౌనమే ప్రధాని ఆయుధం: నితీశ్ కుమార్
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడమే గాక, వాటిని కనీస ప్రస్తావనకు తీసుకురావడం లేదంటూ దుయ్యబట్టారు. ప్రధాని మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదన్నారు.
ప్రస్తుతం కొన్ని అంశాలపై వ్యూహాత్మక మౌనమే ఆయుధంగా బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఎద్దేవా చేశారు. నల్లధనం వెనక్కి తీసుకురావడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం, బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కల్పించడం లాంటి ఎన్నో వాగ్దానాలను ఆయన మర్చిపోయారన్నారు. దాద్రి, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల లాంటి ఘటనలపై ప్రధాని మోడీ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు.
నితీష్‌దే గెలుపు: మమతా బెనర్జీ
ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కే ఓటు వేయాలని మూడో విడత ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్ ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సూచించారు. కోల్‌కతాలో ఆమె మాట్లాడారు.
నితీష్ లాంటి వ్యక్తి దేశానికి ఎంతో అవసరమన్నారు. ఆయన వల్లే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్నారు. కాగా, బీహార్ లో మూడో విడత ఎన్నికలు అక్టోబర్ 28న జరగనున్నాయి.












Click it and Unblock the Notifications