TCS: ఉద్యోగులకు టీసీఎస్ బిగ్ న్యూస్ ! 80 శాతం మందికి మెయిల్స్..!
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పేరు ఈ మధ్య లేఆఫ్స్, ఏఐ వాడకం విషయంలో వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఏఐ వాడకాన్ని పెంచుతూ 12 వేల మంది ఉద్యోగుల్ని ఒకేసారి తొలగించాలన్న టీసీఎస్ నిర్ణయం ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఉద్యోగులకు ఐదు నెలల క్రితం పెంచాల్సిన జీతాలు పెంచకుండా ఇలా భారీగా ఉద్యోగుల్ని తొలగించడంపై చర్చ జరుగుతున్న వేళ టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం తమ వద్ద పనిచేస్తన్న 80 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు పెంచాలని టీసీఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వేతనాలు పెరకబోతున్న ఉద్యోగులకు మెయిల్స్ పంపుతున్నారు. ఐదు నెలల విరామం తర్వాత ఇలా వేతనాల పెంపు నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి టీసీఎస్ లో ఏప్రిల్ నెలలోనే జీతాలు పెంచాల్సి ఉండగా.. ఐదు నెలలు ఆలస్యంగా ఇలా వేతనాలు పెంచుతున్నారు.

వాస్తవానికి ఏప్రిల్‌లో వేతనాలు పెంచాల్సి ఉండగా.. అప్పట్లో అంతర్జాతీయంగా బలహీనమైన డిమాండ్, ద్రవ్యోల్బణం , అమెరికా వాణిజ్య విధానంలో అనిశ్చితి తలెత్తాయి. దీంతో తమ క్లయింట్లు నిర్ణయాలు , ప్రాజెక్టులను ఆలస్యం చేశారని టీసీఎస్ తాజాగా వెల్లడించింది. ఇప్పుడు అసిస్టెంట్ కన్సల్టెంట్, దానికి సమాన గ్రేడ్‌ల వరకు అర్హత కలిగిన అన్ని అసోసియేట్‌లకు వేతనాల పెంపును ప్రకటించేందుకు సంతోషిస్తున్నట్లు, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కాడ్ , సీహెచ్ఆర్వో సుదీప్ ఉద్యోగులకు పంపిన మెయిల్ లో పేర్కొన్నారు.

ఇప్పటికే టీసీఎస్ లే ఆఫ్స్, జీతాల పెంపు ఆలస్యం నేపథ్యంలో ఐటీ పరిశ్రమలోని ఇతర సంస్థలు సైతం అదే బాట పడుతున్నాయి. ఇలాంటి సమయంలో టీసీఎస్ తమ ఉద్యోగుల్లో 80 శాతం మందికి వేతనాలు పెంచుతున్నట్లు చేసిన ప్రకటన ఇండస్ట్రీలో టర్నింగ్ పాయింట్ గా మారబోతోంది. టీసీఎస్ బాటలోనే ఇన్ఫోసిస్ తో పాటు ఇతర సంస్థలూ పయనించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications