అన్నా జట్టు: కేజ్రీవాల్‌తో విభేదాలు, మోడీకి చేరువ
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అన్నా హజారే జట్టు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రికి దూరమవుతూ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి చేరువ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ ఐపియస్ అధికారి, అన్నా జట్టులోని ప్రధాన సభ్యురాలు కిరణ్ బేడీ వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి.
తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ వస్తున్న కిరణ్ బేడీ తన ఓటు నరేంద్ర మోడీకేనని చెప్పారు. భారత్‌కు బలమైన నాయకుడు, అనుభవం గల నాయకుడు కావాలని, ఆ నాయకుడు మోడీ అని, తాను స్వతంత్ర పౌరురాలిగా ఈ విషయం చెబుతున్నానని, తాను ఓ రాజకీయ పార్టీ సభ్యురాలిని కూడా కాదని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు.

కిరణ్ బేడీ ప్రకటనను బిజెపి స్వాగతించింది. కిరణ్ బేడీకి తనదంటూ హోదా ఉందని, సుపరిపాలన కావాలని కోరుకుంటున్నవారు దేశవ్యాప్తంగా పెద్ద యెత్తున మోడీకి మద్దతు తెలియజేస్తున్నారని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు.
వస్తే కిరణ్ బేడీని, మాజీ ఆర్మీ చీఫ్ వికె సింగ్‌ను పార్టీలో చేర్చుకుంటామని మరింత ముందుకు వెళ్లి బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యన్ స్వామి అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పలు విషయాల్లో కిరణ్ బేడీ విభేదిస్తున్నట్లు అర్థమవుతోంది. వికె సింగ్ అన్నా హజారే దీక్ష శిబిరంలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు.
కేజ్రీవాల్‌ను విభేదిస్తూ మోడీకి మద్దతు తెలుపుతూ తన జట్టు సభ్యులు కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అన్నా హజారే మౌనంగా ఉండిపోయారు. అన్నా హజారే కూడా కేజ్రీవాల్‌తో ఏదో మేరకు విభేదిస్తున్నారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications