నేను చేసిన కసరత్తు కూడా చేయలేదు: విభజనపై బాబు

సంప్రదాయాల విస్మరణపై రాష్ట్రపతి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరు ప్రాంతాలవారితో మాట్లాడకుండా ముందుకెళ్తే ప్రజలు బుద్ధి చెప్తారని, కాంగ్రెసును భూస్థాపితం చేసే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై అప్పటికప్పుడు మంత్రి వర్గ సమావేశంలో నోట్ ఇస్తే ఎంత మంది మంత్రులు చదవగలరని ఆయన అడిగారు. ఇప్పుడే నోట్ ఇచ్చి చదవాలంటే ఎలా అని మంత్రులు అడిగినా పట్టించుకోలేదని, మంత్రులే కాపీలు చదవకుండా తీర్మానం చేయడం సమర్థనీయం కాదని ఆయన అన్నారు.
రాజ్యాంగంలోని నిబంధనలు అన్నింటికీ తిలోదకాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. ఎస్ఆర్సి, కమిషన్ల సిఫార్సులు, అసెంబ్లీ తీర్మానాల ద్వారా ఇంత కాలం విభజనలు జరిగాయని, సంప్రదాయాలను పక్కన పెట్టి తన స్వలాభం కోసం కాంగ్రెసు విభజన చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. కమిటీలు వేస్తూ పోయారే తప్ప వాటిని బయటపెట్టలేదని, ఎవరితోనూ చర్చించలేదని ఆయన అన్నారు. కొత్త రాజధాని కోసం మళ్లీ కమిటీనా అని ఆయన అన్నారు. కొత్త రాజధానికి మంచి ప్యాకేజీ అన్నారే గానీ ఏం చేస్తారో ఒక్క మాట కూడా చెప్పలేదని అన్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్నారే గానీ ఏం చేస్తారో ఎలా పూర్తి చేస్తారో చెప్పలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం చేసినట్లుగా గతంలో ఎవరూ విభజన చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పెద్దలు విద్వేషాలు రెచ్చగొట్టి విధ్వంసాలకు కారకులవుతారని ఆయన అన్నారు. విభజన హేతుబద్దంగా, న్యాయం ప్రకారం చేయలేరా అని ప్రశ్నించారు. 18 వేల ఈమెయిల్స్ చదివి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications