జైట్లీతో కెసిఆర్: ప్రత్యేక హోదా, పన్నురాయితీపై చర్చ
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సహాయంపై జైట్లీతో కెసిఆర్ ఈ సమావేశంలో చర్చలు జరిపారు. భేటీ వివరాలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
తెలంగాణకు ప్రత్యేక హోదా, పన్ను రాయితీ ఇవ్వాలని జైట్లీని కోరినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ ఆదాయం ఎక్కువగా ఉందని సమావేశంలో జైట్లీ ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత ఐఓసి, హెచ్‌పిసి వంటి ఆయిల్ కంపెనీలు హైదరాబాదులో పన్నులు చెల్లించడం లేదని, ఆంధ్రప్రదేశ్‌లో చెల్లిస్తున్నాయని జైట్లీకి వివరించామని వినోద్ కుమార్ చెప్పారు.
ఉమ్మడి సంస్థలన్నీ గతంలో హైదరాబాదులో పన్నులు కట్టేవని, ఇప్పుడు హైదరాబాద్ ఆదాయం తగ్గిందని కెసిఆర్ జైట్లీకి చెప్పారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అన్ని విషయాలను కెసిఆర్ ఆర్థిక మంత్రికి వివరించినట్లు వినోద్ కుమార్ తెలిపారు.

ఆర్థిక మంత్రి జైట్లీ ఇరు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, పన్ను రాయితీ ఇస్తారని తాము ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో పది జిల్లాలు ఉంటే వాటిలో 8 జిల్లాలు వెనకబడిన జిల్లాలని ప్రణాళికా సంఘం సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రానున్న సప్లిమెంటరీ బడ్జెట్‌లో తెలంగాణకు కొంత ఊరట లభిరస్తుందని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి పియూష్ గోయల్ అందుబాటులో లేరని, గోయల్ ఢిల్లీకి ఎప్పుడు వస్తే తమ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి గోయల్‌ను కలుస్తారని ఆయన చెప్పారు. పిడికెడు బొగ్గు దొరకని ఆంధ్రలో వేల మెగావాట్ల విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతోందని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ఇందుకు తెలుగుదేశం, కాంగ్రెసు ప్రభుత్వాలు కారణం కాదా అని ఆయన అడిగారు.
తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి బస్సు యాత్రలు మాని దిగువ సీలేరు ప్రాజెక్టు వద్ద ధర్నా చేపట్టాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే టిడిపి నేతలు బస్సు యాత్రలు చేపట్టారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications