వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: కమ్మ, వెలమ కుల సంఘాలకు వందల కోట్ల విలువ చేసే భూములను ఫ్రీగా ఎలా ఇస్తారు? - రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న - ప్రెస్‌ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తెలంగాణ హైకోర్టు

కోట్ల విలువజేసే భూములను కమ్మ, వెలమ కుల సంఘాలకు ఐదు ఎకరాల చొప్పున ఫ్రీగా ఎలా కేటాయిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించిందని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

''వారికి భూమిని ఎందుకివ్వాల్సి వచ్చిందో కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇటీవల సర్కార్ నిర్వహించిన వేలంలో కోకాపేటలో ఎకరం భూమి రూ.60 కోట్లు పలికిందని.. అదే హైటెక్‌‌ సిటీకి సమీపంలోని అత్యంత ఖరీదైన ఖానామెట్‌‌ ఏరియాలో అయితే ఎకరాకు వంద కోట్ల దాకా ఉంటుందని చెప్పింది.

కమ్మ, వెలమ కుల సంఘాలకు ఉచితంగా భూమిని ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో వివరిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.

రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో కమ్మ, వెలమ కులాలకు ఖానామెట్‌లోని సర్వే నెం. 41/14లో ఐదు ఎకరాల చొప్పున కేటాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్47 చట్టవిరుద్దమని పేర్కొంటూ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఎ.వినాయక్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఈ పిల్‌పై విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదిస్తూ.. భూమి కేటాయింపు ప్రక్రియ పరిశీలిస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. జూన్‌ 26న కలెక్టర్‌ నుంచి సీసీఎల్‌ఏకు భూమి కేటాయించాలంటూ రిపోర్ట్ అందిందన్నారు. రెండు రోజుల తర్వాత 28వ తేదీన కలెక్టర్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారని.. ఇంకో రెండు రోజులకే 30వ తేదీన భూమి కేటాయిస్తూ జీవో జారీ అయిందన్నారు.

ఇదంతా అత్యంత వేగంగా కేవలం ఐదురోజుల్లోనే పూర్తయిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థితిలో ఉన్న కమ్మ, వెలమ కులాలకు ఎందుకు ప్రభుత్వం ఉచితంగా భూమిని కేటాయించిందో జీవోలో పేర్కొనలేదన్నారు.

అత్యంత విలువైన భూమిని ఆగమేఘాలపై ఇచ్చేశారని తప్పుపట్టారు. రెండు రాష్ట్రాల్లో పాలన సాగించిన, సాగిస్తున్న కులాలకు ఉచితంగా భూములు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆ కులాలు సామాజికంగా, ఆర్థికంగా బలహీనవర్గాలేమీ కాదన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ రెండు కులాలదే పైచేయి అన్నారు. ఆ రెండు కుల సంఘాలు భూమి కావాలని కోరకున్నా.. ప్రభుత్వం భూమిని ధారాదత్తం చేసిందని వివరించారు.

ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ ఇతర సంఘాలకు ఇచ్చినట్లుగానే కమ్మ, వెలమ కుల సంఘాలకు కూడా భూమిని కేటాయించినట్లు చెప్పారు. ఉచితంగా కేటాయింపు చేయలేదని, మార్కెట్‌ ధరలను నిర్ణయిస్తామన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగానే భూమిని వారికి స్వాధీనం చేశామన్నారు.

వాదనలు విన్న తర్వాత.. పిటిషనర్‌ చెబుతున్నట్లుగా అంత ఖరీదైన భూములను కమ్మ, వెలమ కులాలకు ఎట్ల కేటాయించారని హైకోర్టు ప్రశ్నించింది.

కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, వెలమ, కమ్మ సంఘాల సమాఖ్యలకు నోటీసులు ఇచ్చింది''అని వెలుగు తెలిపింది.

బదయూలో గ్యాంగ్ రేప్

హైదరాబాద్‌లో యువతిపై పట్టపగలే అత్యాచారం

హైదరాబాద్ నగరంలో పట్టపగలే యువతిపై అత్యాచారం జరిగిందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

''తాను పనిచేసే ప్రాంతానికి వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కగా, దగ్గరి దారంటూ దారిమళ్లించిన డ్రైవర్‌ ఆమెపై అత్యాచారం చేశాడు. సంతోష్‌నగర్‌ ఠాణా పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది.

సంతోష్‌నగర్‌ పరిధిలో నివసిస్తున్న యువతి (20) మైలార్‌దేవ్‌పల్లిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్లే క్రమంలో బుధవారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో ఆటో ఎక్కారు.

ఆటోను దారి మళ్లించిన డ్రైవర్‌ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అపస్మారక స్థితికి చేరిన బాధితురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయిన ఆమె తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదుచేశారు.

'బాధితురాలు ఇంకా షాక్‌లో ఉన్నందున వివరాలు సక్రమంగా చెప్పలేకపోతున్నారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందా? ఒక్కడే అఘాయిత్యానికి పాల్పడ్డాడా? అనేది తెలుసుకునేందుకు బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించాం. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆటో డ్రైవర్‌ కోసం గాలిస్తున్నాం’ అని దక్షిణ మండలం డీసీపీ గజరావ్‌ భూపాల్‌ తెలిపారు’’అని ఈనాడు వివరించింది.

మహిళలు

మగబిడ్డ పుట్టలేదని మరుగుతున్న నీటిని భార్యపై పోశాడు

మగబిడ్డ పుట‍్టలేదని యూపీలో ఓ భర్త తన భార్యపై మరుగుతున్న నీటిని పోశాడని సాక్షి తెలిపింది.

''ఆమె తీవ్రంగా గాయపడటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన సత్యపాల్‌కు సంజు అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు.

ముగ్గురు కుమార్తెలే పుట్టడంతో పుట్టింటి నుంచి అదనపు కట్నం రూ. 50 వేలు తీసుకురావాలంటూ కొంతకాలంగా సత్యపాల్‌ భార్యను వేధిస్తున్నాడు. ప్రతి రోజూ ఇదే విషయంపై హిసించసాగాడు.

మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్యపై ద్వేషం పెంచుకున‍్న సత్యపాల్‌ కొద్ది రోజులుగా సంజూకు భోజనం కూడా పెట్టడం లేదు. ఇక ఈ క్రమంలోనే ఈ నెల 13న ఇంట్లో ఉన్న తన భార్యతో వాగ్వాదానికి దిగిన సత్యపాల్ ఆవేశంలో పక్కనే స్టవ్‌పై మరుగుతున్న వేడినీటిని ఆమెపై పోశాడు.

దీంతో సంజూ తీవ్రంగా గాయపడటంతో గమణించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు’’అని సాక్షి వివరించింది.

తెలంగాణ గవర్నర్‌కు మాతృ వియోగం

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాతృమూర్తి కృష్ణకుమారి (80) కన్నుమూశారని నమస్తే తెలంగాణ తెలిపింది.

''తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ప్రైవేటు దవాఖానకు తరలించగా.. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని రాజ్‌భవన్‌లో ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు.

సాయంత్రం తమిళనాడు తీసుకువెళ్లారు. చెన్నైలోని సాలిగ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తమిళిసై మాతృమూర్తి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఫోన్‌లో తమిళిసైని పరామర్శించారు.

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు స్టాలిన్‌, రంగస్వామి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గవర్నర్‌ను ఫోన్‌లో పరామర్శించారు.

రాజ్‌భవన్‌లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కృష్ణకుమారి పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Telangana:How can you give hundreds of crores worth land to Kamma and Velama community-HC to govt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X