హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ: రిపబ్లిక్ డే అంటే ఇంతేనా... వరసగా రెండోసారి వేడుకలకు హాజరు కాని సీఎం కేసీఆర్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తెలంగాణ రిపబ్లిక్ డే

భారతదేశంలో అన్ని పెద్ద రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలో మాత్రం అత్యంత పేలవంగా సాగాయి. అన్ని పెద్ద రాష్ట్రాల్లో భారీ సైనిక, పోలీసు కవాతులు, కళ్లు చెదిరే సాంస్క్రతిక ప్రదర్శనలు, అభివ్రుద్ధిని చాటే శకటాలతో వేడుకలు జరిగితే తెలంగాణలో మాత్రం తూతూ మంత్రంగా చేసి మమ అనిపించారు. ఒక రకంగా గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య విబేధాలకు రిపబ్లిక్ డే ని వేదికైంది.

గవర్నర్ గో బ్యాక్ అంటూ గోడలపై నినాదాలు రాసే స్థాయిలో తమిళనాడులో గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, గవర్నర్ రవి పక్కన నుంచుని రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణలో మాత్రం గణతంత్ర వేడుకలపై వివాదాల ప్రభావం స్పష్టంగా కనిపించింది.

గత నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లిక్ డే వైభవం తగ్గుతూ వస్తోంది. 2019 వ సంవత్సరం వరకూ రిపబ్లిక్ డే పెరేడ్ గ్రౌండ్స్ లో అద్భుతంగా జరిగేవి. కానీ, మొదటిసారి 2020వ సంవత్సరంలో రిపబ్లిక్ డే ని నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లోకి మార్చారు. పెరేడ్ గ్రౌండ్స్ తో పోలిస్తే చాలా చిన్న స్థలం అది.

అంతేకాదు, మొత్తం పెరేడ్ నిడివి కూడా తగ్గించారు. సాంస్కృతిక ప్రదర్శనలూ తగ్గాయి. అప్పటికి భారతదేశంలో కరోనా లాక్ డౌన్ కూడా లేదు. కానీ, ఆ ఏడాది మాత్రం రిపబ్లిక్ డే వేడుకలు గతం కంటే భిన్నంగా, తక్కువ కార్యక్రమాలతో చేశారు. ఇక 2021 సంవత్సరంలో కూడా నాంపల్లిలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య విభేదాలు

2022వ సంవత్సరానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య విబేధాలు బాగా ముదిరాయి. దీంతో ఆ ఏడాది రిపబ్లిక్ వేడుకలు రాజ భవన్ లో పెద్దగా ఎవరూ అతిథులు లేకుండా, హడావిడి , హంగులు లేకుండా సాదా సీదాగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ వేడుకలకు హాజరు కాలేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కాకపోవడం అదే మొదలు. కేసీఆర్‌కు జ్వరం రావడం వల్లే ఆయన రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొనలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.

2023 లో కూడా పరిస్థితి మారలేదు. వరుసగా రెండో ఏడాదీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ అధికారిక రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనలేదు. నిజానికి ఈసారి రిపబ్లిక్ డే గురించి ముందు నుంచి గవర్నర్ తరచుగా ప్రస్తావిస్తూ వచ్చారు. అయినప్పటికీ రాజ భవన్ లోనే రిపబ్లిక్ డే జరుపుకోవాలని ప్రభుత్వం గవర్నర్ కి సూచించింది.

నిజానికి గతంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదనీ, ఇదే మొదటిసారి అనీ బీబీసీతో అన్నారు సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాస రావు.

యన్టీఆర్ సీఎంగా, గవర్నర్ గా కుముద్ బెన్ జోషీ ఉన్నప్పుడు కూడా తీవ్ర స్థాయిలో విబేధాలు ఉన్నాయనీ అప్పుడు కూడా రిపబ్లిక్ డే విషయంలో ఇలా జరగలేదనీ మరో సీనియర్ జర్నలిస్టు జింకా నాగరాజు బీబీసీతో అన్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

పెరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే నిర్వహించకపోవడంపై నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు శ్రీనివాస్ అనే వ్యక్తి. దీనిపై విచారించిన హైకోర్టు, ఎట్టి పరిస్థితుల్లోనూ రిపబ్లిక్ డేను ఘనంగా నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

రిపబ్లిక్ డే ఘనంగా నిర్వహించకపోవడానికి కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనలు కారణం అని కోర్టులో ప్రభుత్వ లాయర్ చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు జడ్జి, ''లక్షల మందితో సభ నిర్విహించినప్పుడు లేని కోవిడ్, రిపబ్లిక్ డేకి వస్తుందా అంటూ'' వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

మొత్తానికి హైకోర్టు ఆదేశాలతో అప్పటికప్పుడు ప్రభుత్వం రిపబ్లిక్ డే కి ఏర్పాట్లు చేసింది. నిన్న సాయంత్రం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సచివాలయంలో అత్యవసర సమీక్ష జరిపారు. ప్రోటోకాల్ ప్రకారం రాజభవన్ లో వేడుకలకు ఏర్పాట్లు చేశారు.

అయితే, 2019 కి ముందు వరకూ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకూ, ఇవాళ తెలంగాణ రాజభవన్ లో జరిగిన వేడుకలకూ అసలు పొంతన లేదు. ఆర్మీ (పదాతి సేన), వాయుసేన కవాతు లేదు. కేంద్ర బలగాలు లేవు. రాష్ట్ర శకటాలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లేవు. అశ్విక దళం, ఫైర్ సేప్టీ ప్రదర్శనలు.. ఏమీ లేవు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసుల బలగాల నుంచి గౌరవ వందనం (రాష్ట్రీయ సెల్యూట్) మాత్రం ఏర్పాటు చేశారు.

రూల్ ప్రకారం తప్పదు అన్నట్టుగా పెరేడ్ ఉంది. కానీ ఆ పెరేడ్ నాలుగు ప్లటూన్లు కూడా లేవు. వారు కనీసం రెండొందల మీటర్లు కూడా నడవలేదు. పెరేడ్ ఫార్మేషన్, పెరేడ్ ఇన్‌స్పెక్షన్ లేదు.

ఇదే విషయంపై బీబీసీ కొందరు తెలంగాణ అధికారులతో మాట్లాడింది. కేవలం రాష్ట్రీయ సెల్యూట్ జరిగింది తప్ప పెరేడ్ లేదు కదా అని బీబీసీ ప్రశ్నించింది. ''సాంకేతికంగా పెరేడ్ జరిగినట్టే. మాన్యువల్స్ లో ఉన్నట్టే చేశారు'' అని ఆయా అధికారులు బదులిచ్చారు.

సాంకేతికంగా రూల్ ప్రకారం పెరేడ్ అనిపించడానికి కావల్సినవన్నీ అక్కడ చూపించినట్లుగా చేశారు కానీ, వాస్తవ అర్థంలో పెరేడ్ చేయలేదు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ హంగామా ఇక చరిత్రేనా?

సాధారణంగా రిపబ్లిక్ డే ఉత్సవాలకు సికింద్రాాబాద్ దగ్గర చాలా హడావిడి ఉంటుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ పెరేడ్ చూడ్డానికి వస్తారు. ఈసారి రాజభవన్‌లో సాధారణ ప్రజలు కనిపించలేదు. సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులను టెంట్లలో కూర్చోబెట్టారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

రిపబ్లిక్ డే ఉత్సవాల విషయంలో కేసీఆర్ వైఖరిపై బీజేపీ తీవ్రంగా స్పదించింది. రిపబ్లిక్ డే పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలనీ, లేనిపక్షంలో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా రాజ్యాంగ ద్రోహిగా, ప్రజాస్వామ్య ద్రోహిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతారని నిన్న బండి సంజయ్ అన్నారు.

''పరేడ్ లేకపోవడమంటే సైనికులను, పోలీసులను, విద్యార్థులను అవమానించడమే. కోర్టులు మెట్టికాయ వేస్తే తప్ప కేసీఆర్ వినే పరిస్థితి లేదు. సీఎం, మంత్రుల సభలకు అడ్డురాని కోవిడ్ రూల్స్ గణతంత్ర వేడుకలకే వచ్చాయా?'' అని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు అన్నారు.

''జాతీయ భావాలను ప్రజల్లో నింపే ఉద్దేశంతో అత్యంత ఘనంగా పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పరేడ్ ద్వారా సైనికుల, పోలీసుల ధైర్య సాహసాలు ప్రజలు తెలుసుకునే అవకాశముంది. అట్లాగే వివిధ సంస్క్రుతి, సాంప్రదాయాలకు అద్దంపట్టేలా వివిధ కళారూపాలు, విద్యార్థులు నైపుణ్య ప్రదర్శనలు ఈ వేడుకల్లో ప్రతిబింబిస్తాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయాలని కేసీఆర్ నిర్ణయించడం సిగ్గు చేటు. హైకోర్టు ఆదేశిస్తే తప్ప కేసీఆర్ వినే పరిస్థితి లేకపోవడం అత్యంత దురద్రుష్టకరం" అని అన్నారు రామచంద్ర రావు.

కేసీఆర్

అయితే, దీనిపై టీఆర్ఎస్ కూడా అదే రీతిలో స్పందించింది. ''రాజభవన్ చాలా పెద్దది. అంతకంటే పెద్దది ఏముంటుంది? అక్కడ జెండా ఎగరవేస్తే ఇంకేం సమస్య? ప్రోటోకాల్ పాటిస్తున్నాం. రాజ్ భవన్ లో వేడుకలు చేసేది తెలంగాణ ప్రభుత్వమే. కేంద్ర నిధులేం కాదు కదా. అన్నీ ప్రోటోకాల్ ప్రకారమే జరుగుతున్నాయి. వారికి బీజేపీ ప్రోటోకాల్ కొత్తగా కావాలంటే దొరకదు'' అని బుధవారం మీడియాతో అన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రావు.

దేశానికి స్వతంత్రం వచ్చాక ఏ వేడుక ఎలా చేయాలో అలానే చేస్తున్నామని, ఏ పండుగ ఎలా గొప్పగా చేయాలో మాకు తెలుసని కూడా చెప్పిన రాజేశ్వరరావు, "ఆమెను మేం అవమానించలేదు. కేసీఆర్ ఒక్క మాట అనలేదు" అని చెప్పుకొచ్చారు.

మొత్తానికి, కేసీఆర్ తమిళిసై గొడవలతో దేశంలోని మిగిలిన నగర వాసుల్లో హైదరాబాదీలకు ప్రత్యక్షంగా కవాతు చూసే అవకాశం మాత్రం లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telangana: What does Republic Day mean... CM KCR did not attend the celebrations for the second time in a row
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X