కేజ్రీవాల్‌పై పోటీకి నిలిచిన తెలుగు వ్యక్తి..!
హైదరాబాద్: ఫిబ్రవరి 7న జరగునున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ తెలుగు వ్యక్తి పోటీలో నిలిచారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన కందుకూరు సునీల్ కుమార్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్ధిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఎన్నికల అధికారులు సునీల్ కుమార్ నామినేషన్‌ను ఆమోదించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను అధికారులు, ప్రభుత్వం గాలికి వదిలేశారని ఆయన అన్నారు. తనకు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి దిశగా నడిపిస్తానని అన్నారు.

ఢిల్లీ అంసెబ్లీ ఎన్నికల పోరు అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ కిరణ్ బేడీగా మారిపోయాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఫిబ్రవరి 7న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రధానంగా పోటీ బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపిఎస్ అధికారి, అవినీతి వ్యతిరేక ఉద్యమకారిణి కిరణ్‌బేడీని ఆ పార్టీ ప్రకటించింది. కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీజేపీకి మరింత అనుకూలత కనిపిస్తోందని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఓ సర్వేలో బీజేపీదే పైచేయి అని తేలింది.
తాజాగా జీన్యూస్ త్రూ తలీమ్ రీసెర్జ్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. 70 అసెంబ్లీ స్థానాలు గల ఢిల్లీలో మెజార్టీ స్థానాలు బీజేపీకే వస్తాయని తేలింది. సర్వే ప్రకారం.. బీజేపీ 37 స్థానాలతో మొదటి స్థానంలో, ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాలతో రెండో స్థానంలో ఉండనుంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం నాలుగు సీట్లే వస్తాయని తేలింది. అధికారం చేపట్టాలంటే ఓ పార్టీకి రావాల్సిన మేజిక్ ఫిగర్ 36. బీజేపీ దానికంటే ఎక్కువ సీట్లనే గెలుచుకుంటుందని సర్వేలో తేలింది.












Click it and Unblock the Notifications