• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రపంచ ధనవంతుల జాబితాలో తెలుగువారు.. ఎవరెవరు ఎలా ఎదిగారు

By BBC News తెలుగు
|

హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2021 జాబితా బుధవారం విడుదలైంది. ఇందులో 177 మంది భారతీయులకు స్థానం లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ దాదాపు రూ.6.05 లక్షల కోట్ల సంపదతో దేశంలో అత్యంత ధనవంతునిగా నిలిచారు. ఆయన అంతర్జాతీయంగా 8వ స్థానంలో ఉన్నారు.

ఈ జాబితాను జనవరి 15 నాటికి ఉన్న సంపద వివరాలకనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా 68 దేశాల నుంచి 2402 సంస్థలకు చెందిన 3228 మంది కోటీశ్వరుల సంపదను అంచనా వేసింది.

ఈ ఏడాది కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ ఈ దశాబ్దంలోనే సంపద గత దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని హురున్ రిపోర్టు చైర్మన్ రూపర్ట్ హూగ్వర్ఫ్ చెప్పారు.

టెస్లా సంస్థల అధినేత ఎలన్ మస్క్ 1970 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా నిలిచారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండవ స్థానంలోకి వెళ్లారు.

ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్‌బ‌ర్గ్‌ 1010 బిలియన్ డాలర్ల సంపదతో అయిదవ స్థానంలో ఉన్నారు.

ఈ జాబితాలో కొంతమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

వీరిలో ఎక్కువ మంది ఔషధ, వైద్య రంగానికి చెందిన వారే ఉన్నారు. మిగిలిన వారు నిర్మాణ, మౌలిక సదుపాయాల సంస్థల అధిపతులు. జాబితాలో పేరు సంపాదించుకున్న తెలుగు వారెవరో చూద్దాం..

మురళీ దివి

హైదరాబాద్ కి చెందిన దివీస్ సంస్థ అధినేత మురళీ దివి 74 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 385వ స్థానంలో ఉన్నారు.

అమెరికాలో శిక్షణ పొందిన మురళి దివి హైదరాబాద్ లో1990లో ఔషధ పరిశోధన సంస్థ దివీస్ లాబొరేటరీస్ స్థాపించారు. ఈ సంస్థ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పంపిణీదారుల్లో ప్రపంచంలో అగ్ర సంస్థగా ఉంది.

ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో పెరిగారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితులే ఆయన కష్టపడటానికి కారణమని ఫోర్బ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఆయన పిల్లలు కూడా ప్రస్తుతం సంస్థ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆయన వారాంతంలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఆర్గానిక్ ఫార్మ్‌లో గడుపుతారు.

"నాకు ఔషధ తయారీ రంగంలోకి తిరిగి అడుగు పెట్టాలని లేదు. వాటిని నడపడం పులిపై కూర్చుని సవారీ చేయడం లాంటిదే. వాటికి నిరంతరం మాంసం పెడుతూ ఉండాలి. ఈ సంస్థల విషయంలో పెట్టుబడులు పెడుతూ ఉండాలి, పెట్టలేని పక్షంలో, లేదా కాస్త అజాగ్రత్త వహించినా, అది మీ పాదాలనే తినేస్తుంది. ఈ రంగంలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ధరలు నెలలోనే పడిపోతాయి. ఎవరో ఒక కొత్త విధానంతో మార్కెట్లోకి రావడంతో సరకుల ధరలు తగ్గిపోతాయి. కానీ, మీరు ప్లాంట్ నడపాలి, మెషిన్లను నడపాలి, వడ్డీలు కట్టాలి" అని మురళి దివి ఫోర్బ్స్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

పీవీ రామప్రసాద్ రెడ్డి

పివి రామప్రసాద్ రెడ్డి అరోబిందో ఫార్మా సహ వ్యవస్థాపకులు. ఆయన ఈ సంస్థను ఆయన బంధువు నిత్యానంద రెడ్డితో కలిసి 1986లో స్థాపించారు. ఆయన సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ మధుమేహం, గుండె సంబంధిత రోగాలకు ఔషధాలను తయారు చేస్తుంది. సంస్థ ఆదాయంలో 75 శాతం అమెరికా, యూకే నుంచి వస్తుంది.

రామప్రసాద్ రెడ్డి 31బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 1096వ స్థానంలో ఉన్నారు.

ఈయనకు ఇద్దరు పిల్లలు. ఈయన ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో కూడా ఉన్నారు.

బి.పార్థసారథి రెడ్డి

బి పార్థసారథి రెడ్డి 1993లో హెటెరో సంస్థను స్థాపించి దానికి డైరెక్టర్ గా ఉన్నారు. ఈయన 22 బిలియన్ డాలర్ల సంపదతో హురూన్ జాబితాలో 1609వ స్థానంలో ఉన్నారు.

ఆయనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్‌లో ఉన్న విశేష అనుభవం సంస్థ ఎదుగుదలకు తోడ్పడింది. ఈ సంస్థ యాంటీ రెట్రో వైరల్ మందులు ఉత్పత్తితో మార్కెట్లో అడుగు పెట్టింది.

జీవీ ప్రసాద్ , జి.అనురాధ

జీవీ ప్రసాద్, జి.అనురాధ సంయుక్తంగా 15 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 2238వ స్థానంలో ఉన్నారు.

ఆయన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కో-చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి నుంచి ఇంజనీరింగ్ , పర్డ్యూ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు.

రెడ్డీస్ సంస్థను ఆయన మామగారు అంజిరెడ్డి స్థాపించారు.

జీవీ ప్రసాద్‌కు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఆసక్తి. ఆయన వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆయనకు ముగ్గురు పిల్లలు.

సతీశ్ రెడ్డి

సతీశ్ రెడ్డి ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థను ఆయన తండ్రి అంజి రెడ్డి 1983లో ప్రారంభించారు.

ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. పర్ డ్యూ యూనివర్సిటీ నుంచి మెడిసినల్ కెమిస్ట్రీ చదివారు. ఆయన 1991 నుంచి కుటుంబ వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టారు. ఆయన భార్య దీప్తి ప్రాంతీయ పత్రిక 'వావ్’ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు.

సతీశ్ రెడ్డి 17 బిలియన్ డాలర్ల సంపదతో 2050 వ స్థానంలో ఉన్నారు.

అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి 16 బిలియన్ డాలర్ల సంపదతో 2138వ స్థానంలో ఉన్నారు

ప్రతాప్ రెడ్డి

అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి 16 బిలియన్ డాలర్ల సంపదతో 2138వ స్థానంలో ఉన్నారు.

ఆయన చెన్నై, అమెరికాలలో వైద్య విద్యను అభ్యసించి 1971లో ఇండియా తిరిగి వచ్చారు. ఆయన 1983లో150 పడకలతో చెన్నైలో స్థాపించిన అపోలో హాస్పిటల్స్ నేటికి 64 శాఖలకు విస్తరించి 10,000 పడకల స్థాయికి పెరిగింది.

వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకు భారత ప్రభుత్వం ఆయనకు 1991లో పద్మ భూషణ్ అవార్డును 2010లో పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది.

పి.పిచ్చి రెడ్డి

పి.పిచ్చి రెడ్డి 14 బిలియన్ డాలర్ల సంపదతో హురున్ జాబితాలో 2383వ స్థానంలో ఉన్నారు. ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మున్సిపాలిటీలకు చిన్న పైపులు నిర్మించేందుకు 1989లో మేఘ ఇంజనీరింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్థాపించారు.

2006లో సంస్థ పేరును మేఘ ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌గా మార్చారు. ఆయన మేనల్లుడు పీవీ కృష్ణా రెడ్డి 1991లో కంపెనీ వ్యవహారాల నిర్వహణకు ఆయనతో పాటు చేరారు. ఈయన కూడా పిచ్చిరెడ్డితో సమానంగా హురున్ జాబితాలో 2383 స్థానంలో నిలిచారు.

ప్రస్తుతం ఈ సంస్థ తెలంగాణాలో ప్రతిష్టాత్మక సాగు నీటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది.

వీరికి విదేశాలలో కూడా ప్రాజెక్టులు ఉన్నాయి.

రామేశ్వర రావు జూపల్లి

రామేశ్వర రావు జూపల్లి 14 బిలియన్ డాలర్ల సంపదతో 2383వ స్థానంలో ఉన్నారు.

రామేశ్వర రావు 1955లో జన్మించారు. ఆయన 1981లో మై హోమ్ రియల్ ఎస్టేట్ సంస్థలను స్థాపించారు. మహా సిమెంటు సంస్థలకు కూడా అయన అధిపతి.

ఆయనకు 2017లో హెచ్ఎం టీవీ బిజినెస్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ప్రదానం చేసింది.

డాక్టర్ ఎం సత్యనారాయణ రెడ్డి

డాక్టర్ ఎం సత్యనారాయణ రెడ్డి 13బిలియన్ డాలర్ల సంపదతో 2530వ స్థానంలో ఉన్నారు.

ఆయన ప్రజలందరికీ అత్యుత్తమ ఔషధాలను తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యంతో ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ని స్థాపించారు. ఆయన సంస్థ చైర్మన్ గా ఉన్నారు.

ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్‌డీ చేశారు.

ఆయన 2003లో పారిశ్రామికవేత్తగా మారక ముందు ఒక ప్రముఖ ఔషధ తయారీ సంస్థలో కెమిస్టుగా కెరీర్ ప్రారంభించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అధినేతగా ఎదిగారు.

వీసీ నన్నపనేని

ఫార్మాస్యూటికల్ రంగంలో వీసీ నన్నపనేనికి 42 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన అమెరికాలో వివిధ ఫార్మాస్యూటికల్ సంస్థల్లో పని చేశారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం నుంచి ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన అమెరికాలో బ్రూక్ లిన్ కాలేజీ నుంచి కూడా ఫార్మాస్యూటికల్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

ఆయన సంస్థ సాధారణ కార్యకలాపాలతో పాటు కొత్త రకాల ఔషధాలను కనిపెట్టే కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తారు. ఆయన నాట్కో ఫార్మా సంస్థల అధినేత. ఆయన 12 బిలియన్ డాలర్ల సంపదతో 2686వ స్థానంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telugu people in the list of the world's richest persons
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X