టెర్రర్ అలెర్ట్ : భారత్ లోకి ఆఫ్ఘనిస్థాన్ టెర్రరిస్టులు.. 40మందికి శిక్షణ; టిఫిన్ బాంబు దాడులకు స్కెచ్ !!
భారతదేశానికి ఉగ్రవాదులతో ప్రమాదం పొంచి ఉందా ? రానున్న పండుగలను టార్గెట్ చేసుకుని భారతదేశంపై దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారా? టిఫిన్ బాంబులతో దాడులు చేయడానికి రెడీ అవుతున్నారా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి భారతదేశంలో జరుగుతున్న ఉగ్రవాద చొరబాట్లు ఆందోళన కలిగిస్తున్నాయా ? ఆఫ్ఘనిస్తాన్ మూలాలున్న ఉగ్రవాదులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల సహకారంతో భారత్ లోకి ప్రవేశిస్తున్నారా ? అంటే అవును అన్న సమాధానమే ఇంటిలిజెన్స్ వర్గాల నుండి వస్తోంది.
భారత సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్ మూలాలున్న ఉగ్రవాదుల కదలికలు
భారతదేశం ఊహించిందే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ మూలాలున్న ఉగ్రవాదులు భారతదేశంపై దాడులకు తెగబడే అవకాశం ఉందని భారత్ అనుమానిస్తున్నట్టే తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను వశం చేసుకున్నప్పటినుండి ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల కేంద్రంగా మారుతుందని, భారత్ పై దాడులు చేసే అవకాశం లేకపోలేదన్న అనుమానాలు నిజమవుతున్నాయి. ఈ మేరకు ఉగ్రవాదులతో పెను ప్రమాదం పొంచి ఉందని, ఆఫ్ఘనిస్తాన్ మూలాలు గల ఉగ్రవాదుల కదలిక సరిహద్దులలో కనిపిస్తుందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.

పండుగల సీజన్ టార్గెట్ .. పాక్ ఉగ్ర సంస్థలతో కలిసి దాడులకు స్కెచ్
దేశంలో రాబోయే పండగ సీజన్లో ఉగ్రవాద కార్యకలాపాలను అమలు చేయడానికి జమ్మూకాశ్మీర్ ప్రాంతంలోని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటు, ఆఫ్ఘనిస్తాన్ మూలాలున్న ఉగ్రవాదులు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని, దాడులు చేసే ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం, వారు లష్కరే తోయిబా, హర్కత్ ఉల్-అన్సార్ (హువా) మరియు హిజ్బుల్ ముజాహిదీన్ కదలికలకు సంబంధించి తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు, ఆఫ్ఘన్ మూలాలున్న ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తున్నారని తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్ మూలాలున్న ఉగ్రవాదులకు ఐఎస్ఐ మద్దతు
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఆఫ్ఘనిస్థాన్ స్వాధీనం చేసుకున్న తాలిబన్ ఉగ్రవాద సంస్థ, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థల సహాయంతో భారతదేశంలోకి ఆఫ్ఘనిస్తాన్ ఆధారిత ఉగ్రవాదులను పంపించే ప్రయత్నం చేస్తోంది. మొదటి నుండి పాకిస్తాన్ తో స్నేహపూర్వక సంబంధాలున్న తాలిబన్లు జమ్ముకాశ్మీర్ లో ముస్లింల కోసం తమ గళం వినిపిస్తామని గతంలోనే చెప్పారు.ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ మూలాలున్న ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించడం గురించి మాకు సమాచారం అందింది, దీనికి ఐఎస్ఐ మద్దతు ఉంది అని ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారు.
పాకిస్తాన్‌లోని నక్యాల్ సెక్టార్‌లోని టెర్రర్ క్యాంప్‌లో దాదాపు 40 మంది ఉగ్రవాదులకు శిక్షణ
నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో పాకిస్తాన్‌లోని నక్యాల్ సెక్టార్‌లోని టెర్రర్ క్యాంప్‌లో దాదాపు 40 మంది ఉగ్రవాదులు ఉన్నారని ఏజెన్సీలు తెలియజేశాయి. పూంచ్ నదిని దాటడం ద్వారా వారు భారతదేశంలోకి ప్రవేశించడానికి శిక్షణ పొందారని . వారు ట్యూబ్‌లు మరియు స్నార్కెలింగ్ ద్వారా నదిని దాటడానికి శిక్షణ పొందుతున్నారని అధికారి తెలిపారు. ఈ టెర్రరిస్టులకు టిఫిన్ బాంబు తయారీలో శిక్షణ ఇచ్చినట్లు మాకు సమాచారం అందిందని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.
టిఫిన్ బాంబులతో దాడులపై జమ్మూ కాశ్మీర్ లో హై అలెర్ట్
టిఫిన్ బాంబులు తయారు చేయడానికి కావలసిన ముడిసరుకు భారతదేశంలో యాక్టివ్‌గా ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా వారికి అందించబడుతుందని తద్వారా వారు భారతదేశంలో విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని, సంబంధిత ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసులు మరియు పారామిలిటరీకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సమాచారం అందించి హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే డ్రోన్ దాడులు, అక్రమ చొరబాట్లు, రోజుకో రకమైన ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తున్న భారత భద్రతా దళాలకు ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ మూలాలున్న ఉగ్రవాదులు కూడా సవాల్ విసురుతున్నారు.












Click it and Unblock the Notifications