సైనిక దుస్తుల్లో వచ్చి పీఎస్‌పై ఉగ్రదాడి: 11మంది మృతి
గురుదాస్‌పూర్: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం సైనిక దుస్తులు ధరించిన సుమారు నలుగురు ఉగ్రవాదులు.. మొదట ఓ బస్సుపై కాల్పులు జరిపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌పై కాల్పులు జరుపుతూ లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదుల దాడిలో 11 మంది మృతి చెందారు.
మరికొందరు పౌరులు, పోలీసులకు బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. హై అలర్ట్ ప్రకటించిన ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

'ఈ ఉదయం ఓ మారుతీ కారులో దూసుకొచ్చిన ముగ్గురు లేదా నలుగురు దుండగులు దిగీదిగగానే పోలీసులపై కాల్పులు జరుపుతూ స్టేషన్ లోకి వెళ్లారు' అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా, పోలీస్ స్టేషన్‌పై కాల్పులకు పాల్పడింది ఉగ్రవాదులేనని హోంశాఖ ధృవీకరించింది.
ఈ సంఘటన చోటుచేసుకున్న దీననగర్ పాక్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండటం, ఆ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ కీలక స్థావరాలు ఉండటం గమనార్హం. కాగా, ఉగ్రవాదులు దాడికి పాల్పడవచ్చని ఐబి ముందే హెచ్చరించింది.
ఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పంజాబ్ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి ఎన్ఎస్‌జి, సైనిక బలగాలను పంపించారు. పంజాబ్ ఘటనతో దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, గురుదాస్‍పూర్ సమీపంలోని రైలు పట్టాలపై అమర్చిన 5 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications