గర్భాన్ని తొలగించే గరిష్ఠ పరిమితిలో మార్పు : గడువు 20 నుంచి 24 వారాలకు పెంపు : మార్గదర్శకాలు జారీ..!!
గర్భాన్ని తొలగించే గరిష్ఠ పరిమితి గడువు అంశంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అబార్షన్ సవరణ చట్టం 2021 ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లో గర్భం దాల్చిన మహిళలు అబార్షన్‌కు అర్హులని పేర్కొంది. కొన్నివర్గాల మహిళలకు గర్భాన్ని తొలగించే విధానంలో అమలు చేయాల్సిన విధి విధానాలను ఈ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీని ద్వారా అసాధారణ పరిస్థితుల్లో గర్భం దాల్చిన మహిళలు 24 వారాల తర్వాత కూడా గర్భస్రావం చేయించుకునేందుకు ఇప్పుడు కేంద్రం అనుమతించింది.
గర్భస్రావానికి ఇదివరకు ఉన్న 20 వారాల గడువును పెంచింది. కేంద్రం విడుదల చేసిన తాజా గైడ్ లైన్స్ ప్రకారం..రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన వైద్య మండలి ప్రత్యేక అనుమతితో ఇద్దరు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అబార్షన్ చేయించుకునే వీలు కల్పిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. ఇదే సమయంలో ఎవరికి ఈ నూతన నిర్ణయం వర్తించేదీ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీని మేరకు లైంగిక దాడికి గురైనవారు..అత్యాచార బాధితులు..రక్త సంబంధంగల (ఇన్‌సెస్ట్)వారితో గర్భం దాల్చినవారు అర్హులుగా పేర్కొంది.

దీంతో పాటుగా మరి కొన్ని ప్రత్యేక కారణాలతో గర్బం దాల్చి వారి విషయంలోనూ ఈ నిర్ణయం అమలు కానుంది. మైనర్లు.. గర్భం దాల్చిన సమయంలో వితంతువులైనవారు.. విడాకులు తీసుకున్నవారు.. దివ్యాంగులు..మతి స్థిమితం లేనివారు.. గర్భం కారణంగా తల్లి ప్రాణాలకు ముప్పు అని తేలినా వారు సైతం అర్హలుగా కేంద్రం కొత్త చట్టంలో స్పష్టం చేసింది. ఒకవేళ కాన్పు జరిగినా బిడ్డ తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బందిపడే అవకాశం ఉందని తేలితే..ఆ సందర్భాల్లోనూ గర్భస్రావం చేయించుకునేందుకు కేంద్రం అనుమతించింది.
Recommended Video
వైద్యపరమైన కారణాలతో చేసే అబార్షన్ల కోసం తాజా నిబంధనలు రూపొందించింది. ఇదే సమయంలో 24 వారాల తర్వాత గర్భస్రావం చేయించుకోవాలంటే రాష్ట్రాలు ఏర్పాటు చేసే వైద్య మండలి అనుమతి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాంటి గర్భస్రావం వల్ల ప్రాణాలకు ముప్పులేదని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతి లభించనుంది. నివేదికలను పరిశీలించి గర్భస్రావానికి అనుమతింస్తా..లేక నిరాకరిస్తారా అనే విషయాన్ని సంబంధిత అధికారులు మూడు రోజుల్లోపే సమాధానం ఇవ్వాలని నిర్దేశించింది. 9 వారాల నుంచి 20 వారాల్లోపు అబార్షన్‌కు ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనుమతిస్తే సరిపోతుందని వెల్లడించింది. అదే తాజా నిర్ణయం మేరకు 20 నుంచి 24 వారాల మధ్యనైతే ఇద్దరి అభిప్రాయం అవసరమంటూ కేంద్రం తమ మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చింది.












Click it and Unblock the Notifications