కమలం..ఆధునిక పద్మవ్యూహం
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి చెలరేగారు. అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ ఎన్నిలక గుర్తు కమలాన్ని.. కురుక్షేత్ర యుద్ధం నాటి పద్మవ్యూహంతో పోల్చారు. నాటి అభిమన్యుడిలాగా నేడు దేశ ప్రజలు ఈ వ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆరుమంది వ్యక్తులు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని చక్రవ్యూహంలో బంధించి చంపారని గుర్తు చేశారు. ఈ చక్రవ్యూహాన్ని పద్మవ్యూహం అని కూడా అంటారని పేర్కొన్నారు.

ఈ 21వ శతాబ్దంలోకూడా మరో ఆరుమంది వ్యక్తులు పద్మవ్యూహాన్ని పన్నారని, దేశ ప్రజలు ఇందులో చిక్కుకుని బయటికి రాలేక విలవిల్లాడుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. నాటి అభిమన్యుడి తరహాలో నేడు యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులు.. ఈ చక్రవ్యూహంలో చిక్కుకుపోయారని పేర్కొన్నారు.
ఆధునిక భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు.
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీని ఏ1, ఏ2గా తొలుత అభివర్ణించారు రాహుల్ గాంధీ. వారిద్దరి పేర్లను ప్రస్తావించడంపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి రాహుల్ గాంధీ బదులిస్తూ- అజిత్ దోవల్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ పేర్లను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.
కమలం ఏ రకంగా ఉంటుందో అలాంటి పద్మవ్యూహాన్ని పన్నారంటూ ధ్వజమెత్తారు. పైగా దాన్ని ప్రధాని మోదీ తన ఛాతీపై తగిలించుకుని తిరుగుతుంటారని గుర్తు చేశారు. దేశాన్ని ఆక్రమించిన ఈ చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయని విమర్శించారు రాహుల్ గాంధీ.
1- గుత్తాధిపత్యం, 2- సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను వంటి దర్యాప్తు సంస్థలు 3- పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఈ పద్మవ్యూహానికి మూల స్తంభాలని అన్నారు. హిందూయిజంతో పాటు భారత్‌లోని ప్రతి మతం కూడా ఇలాంటి చక్రవ్యూహాలను వ్యతిరేకిస్తోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, హరిత విప్లవం, మరో స్వాతంత్ర్యం పోరాటాన్ని తలపెట్టడం, రాజ్యాంగం ద్వారా ఈ చక్రవ్యూహాలను తుత్తునీయలు చేస్తామని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. మహాశివుడి ఆశీర్వాద బలం ఉన్న భారత్‌ను ఇలాంటి వ్యూహాలు ఎప్పటికీ ఓడించలేవని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications