ప్రాణం తీసిన విషవాయువు: 11 మంది దుర్మరణంం: ఆసుపత్రిలో పలువురు
చండీగఢ్: పంజాబ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన విషవాయువు 11 మంది ప్రాణాలను హరించివేసింది. ఈ ఘటనలో పలువురు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణ విభాగం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక కార్యక్రమాలను చేపట్టారు. అనారోగ్యం బారిన పడిన వారిని ఎస్పీఎస్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. ఈ ఘటన పట్ల పంజాబ్ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంతాపం తెలిపారు.
పంజాబ్‌లో ఇండస్ట్రీయల్ హబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న లూధియానా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని గ్యాస్‌పురాలో గల ఓ ఫ్యాక్టరీ నుంచి ఈ ఉదయం విషవాయువు వెలువడింది. ఈ ఘటనలో తొలుత తొమ్మిదిమంది మరణించారు. వారిలో అయిదు మంది మహిళలు, ఇద్దరు బాలురు ఉన్నారు. విషవాయువులను పీల్చడం ద్వారా తీవ్ర అనారోగ్యం పాలైన వారిని ఎస్పీఎస్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. వారిని నవనీత్ కుమార్, నీతు దేవిగా గుర్తించారు. విషవాయువు వ్యాప్తి చెందిన ప్రదేశాలను యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయిస్తోన్నామని లూధియానా వెస్ట్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ స్వాతి తివానా తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపామని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోన్నామని తెలిపారు.
ఓపెన్ డ్రైనేజీ నుంచి విషవాయువు వెలువడినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్యాస్‌పురా సమీపంలోని ఓ కెమికల్ కంపెనీ.. తన వ్యర్థాలను ఓపెన్ నాలాలోకి విడుదల చేయడం వల్లే ఈ పరిణామాలు తలెత్తిందని అంటున్నారు. మురుగునీటిలో ప్రమాదకర రసాయనిక వ్యర్థలు కలిశాయని, ఫలితంగా ఘాటు వాసన వెలువడినట్లు చెప్పారు. సహాయక కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే రాజిందర్ కౌర్ ఛీనా పర్యవేక్షిస్తోన్నారు.
మరణాల సంఖ్యను నియంత్రించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నామని పేర్కొన్నారు. ప్రత్యేక మాస్కులు, పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్స్‌ను స్థానికులకు అందజేస్తోన్నామని వివరించారు. యుద్ధ ప్రాతిపదికన సంఘటన స్థలాన్ని ఖాళీ చేయిస్తోన్నామని, దీనికోసం ప్రత్యేకంగా వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. వారందరినీ సురక్షిత ప్రదేశానికి తరలిస్తోన్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications