జయ మేనకోడలు దీపా దెబ్బ: అమ్మ డీఎంకే పార్టీ ఆవిర్భావం
చెన్నై: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకుంది. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ అభిమానులు శుక్రవారం తమిళనాడులోని నమ్మక్కల్ ప్రాంతంలో అఖిల భారత అమ్మ డీఎంకే (ఆల్ ఇండియా అమ్మ డీఎంకే) పార్టీని స్థాపించారు.
జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా తాము శశికళను అంగీకరించమని పలువురు కార్యకర్తలు బహిరంగంగా వ్యతిరేకించారు.

అన్నాడీఎంకే పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు శశికళ నటరాజన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంలో జయలలిత మేనకోడలు దీపాకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు.
శుక్రవారం నమ్మక్కల్ ప్రాంతంలో జయలలిత అభిమానులు, దీపా మద్దతుదారులు అఖిల భారత అమ్మ డీఎంకే పార్టీని స్థాపించి పార్టీ జెండాను తయారు చేశారు. పార్టీ జెండా మీద జయలలిత రెండు వేళ్లు పైకి చూపిస్తూ విజయచిహ్నంతో ఉన్న ఫోటోలు పెట్టారు. శశికళ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా ఉన్నంత వరకు ఆ పార్టీకి ఓట్లు వెయ్యమని పార్టీ కార్యకర్తలు శపథం చేశారు.












Click it and Unblock the Notifications