Indigo: గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. ఆందోళన చెందిన ప్రయాణికులు..
మంగళవారం మధ్యాహ్నం లక్నో నుంచి ముంబైకి బయలుదేరిన ఇండిగో విమానాన్ని ఉదయపూర్ మళ్లించారు. ఇందుకు సంబంధించి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండిగో ఫ్లైట్ 6E 2441 లక్నో విమానాశ్రయం నుంచి ఉదయం 11.10 గంటలకు బయలుదేరిన విమానం మధ్యాహ్నం 1.15 గంటలకు ముంబైలో ల్యాండ్ కావాల్సి ఉంది. ముంబైలో ల్యాండ్ చేయడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు విమానాన్ని ఉదయపూర్ మళ్లించారు.
చివరికి విమానం రాత్రి 8 గంటలకు ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ల్యాండింగ్ తర్వాత, ప్రయాణికులు విమానయాన సంస్థ పైలట్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. కొందరు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, నియంత్రణ సంస్థ DGCAకి ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. "ఇండిగో టీమ్ యొక్క పేలవమైన నిర్వహణ కారణంగా ఫ్లైట్ ఇండిగో 6E 2441 (Lko నుండి ముంబై) ముంబైలో ల్యాండ్ కాలేదు. ఎయిర్‌బస్ పనిచేయకపోవడం లేదా పైలట్ నిర్వహించలేని అవకాశాలు ఉన్నాయి" అని అజయ్ కపూర్ ట్వీట్ చేశారు.

Flightradar24.com నుంచి వచ్చిన డేటా ప్రకారం, విమానం 7,000 అడుగుల ఎత్తులో విమానం చక్కర్లు కొట్టింది. ఉదయపూర్ విమానాశ్రయానికి మళ్లించే ముందు 300 అడుగుల వరకు కిందికి వచ్చింది. గుజరాత్ తీరంలో బిపార్జోయ్ తుఫాను ప్రభావం కారణంగా ఈదురు గాలులు ఈ దారి మళ్లింపుకు కారణమని ముంబై ATC వర్గాలు తెలిపాయి. " వాతావరణం కారణంగా, పైలట్ ముంబైలో ల్యాండ్ కాలేదు. ఉదయపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు" అని ఇండిగో ప్రతినిధి చెప్పారు.
మరో ఘటనలో ఇండిగో విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా.. విమానం తోక భూమిని తాకింది. అయితే పైలట్లు విమానాన్ని సురక్షింతగా ల్యాండ్ చేశారు. జూన్ 11న కోల్ కతా నుంచి ఢిల్లీకి వచ్చిన ఇండిగో విమానం కిందికి దిగుతుండగా తోక భాగం రన్ వేను తాకింది.












Click it and Unblock the Notifications