• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#TheKashmirFiles: 'నిజాన్ని చూపిస్తే ఆందోళన ఎందుకు' - ప్రధాని మోదీ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

మార్చి 11న రిలీజైన #TheKashmirFiles సినిమాపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధాని ఈ సినిమా గురించి చాలా వివరంగా మాట్లాడారు.

kashmir files

"చరిత్రను సరైన కోణంలో, సరైన సమయంలో, సమాజం ముందు ఉంచాలి. ఈ క్రమంలో పుస్తకాలకు, కవితలకు, సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాగే సినిమాకు కూడా ప్రాధాన్యం ఉంటుంది" అని ప్రధాని అన్నారు.

"స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీకి అదే జరిగింది. మొత్తం ప్రపంచం మార్టిన్ లూథర్ గురించి మాట్లాడింది, నెల్సన్ మండేలా గురించి మాట్లాడింది. కానీ, ఈ ప్రపంచం మహాత్మాగాంధీ గురించి చాలా తక్కువగా చర్చించింది."

"ఆ సమయంలో మహాత్మా గాంధీ జీవితంపై సినిమా తీసే ధైర్యం చేసుంటే, మనం బహుశా ఒక సందేశం ఇవ్వగలిగేవాళ్లం. మొదటిసారి ఒక విదేశీయుడు మహాత్మా గాంధీపై సినిమా తీశారు. అవార్డుల మీద అవార్డులు వచ్చాయి. మహాత్మా గాంధీ ఎంత గొప్పవాడో ప్రపంచానికి తెలిసింది" అని నరేంద్ర మోదీ అన్నారు.

"చాలా మంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ గురించి మాట్లాడుతారు. కానీ, మీరు చూసే ఉంటారు ఎమర్జెన్సీ మీద ఎలాంటి సినిమా తీయలేదు. ఎందుకంటే సత్యాన్ని ఎప్పుడూ అణచివేసే ప్రయత్నం జరుగుతుంది. ఆగస్టు 14న భారత విభజనను మనం ఒక హారర్ డేగా గుర్తు చేసుకుంటే, చాలా మందికి అదొక పెద్ద సమస్య అయిపోయింది" అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

https://twitter.com/ANI/status/1503642481573130244

అయినా దేశం ఇవన్నీ ఎలా మరచిపోగలదు. వాటన్నింటి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చని మోదీ అన్నారు.

"భారత విభజన వాస్తవాలపై ఎప్పుడైనా ఏదైనా సినిమా తీశారా? ఎందుకంటే ఈమధ్య మీరు చూసే ఉంటారు. కొత్త సినిమా 'ద కశ్మీర్ ఫైల్స్' వచ్చింది. దాని గురించి చర్చ జరుగుతోంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటూ గొంతెత్తే వాళ్లంతా గత ఐదారు రోజులుగా రగిలిపోతున్నారు. ఈ సినిమాలో చూపించిన వాస్తవాల గురించి మాట్లాడే బదులు, వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు" అని ప్రధాని అన్నారు.

ఈ సినిమాపై వస్తున్నరకరకాల విమర్శలపై కూడా ప్రధాని స్పందించారు.

"ఎవరైనా ఒక నిజాన్ని వెలుగులోకి తీసుకువచ్చే సాహసం చేస్తే, తనకు సత్యం అనిపించిన దానిని అందించాలని ప్రయత్నిస్తే, ఆ సత్యం గురించి తెలుసుకోడానికి, అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అంతేకాదు, ప్రపంచం దీన్ని చూడకుండా అడ్డుపడుతున్నారు. ఈ విషయంలో ఐదారు రోజుల నుంచీ కుట్ర జరుగుతోంది" అన్నారు.

"ఈ సినిమా గురించి నేను ఒక సత్యం చెబుతున్నా. కాదు, ఒక సత్యం గురించి చెబుతున్నా. అదేంటో అర్థవంతంగా చూపిస్తే దేశ ప్రయోజనాలు నెరవేరుతాయి. అందులో ఎన్నో కోణాలు ఉండవచ్చు. ఒకరికి ఒక కోణం కనిపిస్తే, మరొకరికి మరో కోణం కనిపించవచ్చు. మీకు ఈ సినిమా సరిగా లేదనిపిస్తే, వేరే సినిమా తీయండి. ఎవరు వద్దంటున్నారు. కానీ, ఏ సత్యాన్ని ఏళ్ల తరబడి అణచి ఉంచారో దానిని ఆధారాలతో పాటు బయటకు తీసుకురావడం వాళ్లకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే, దానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సత్యం కోసం జీవించేవారికి, ఆ సత్యం కోసం నిలబడాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత అందరూ నిర్వరిస్తారనే ఆశిస్తున్నా" అని ప్రధాని ఆకాంక్షించారు.

కశ్మీర్‌పై సినిమాలు

కశ్మీర్ మీద ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో సినిమాలు తీశారు. వాటిలో కొన్ని కశ్మీర్ పండితులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం గురించి కూడా చెప్పాయి.

"కశ్మీరీ పండిట్లకు ఎప్పుడూ తమ కథను అణచివేస్తున్నారని అనిపించేది కాబట్టే కశ్మీర్ ఫైల్స్‌ మీద స్పందనలు ఇంత తీవ్రంగా ఉన్నాయి. దీనిని నేను 'ఎమోషనల్ కెథార్సిస్' అంటే భావోద్వేగ వ్యక్తీకరణగానే భావిస్తాను" అని జర్నలిస్ట్ రాహుల్ పండితా చెప్పారు.

భారత్‌లోని మిగతా ప్రాంతాలవారికి కశ్మీర్ అప్పటి సమయం గురించి చాలా తక్కువ సమాచారం తెలుసని ఆయన ఉందని చెప్పారు

కానీ, భారత్‌లో దళితులు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, లెఫ్ట్ భావజాలం ఉన్నవారి పట్ల జరిగిన హింసను చూపించడం ప్రధాన స్రవంతి సినిమాల్లో తక్కువే ఉందని కొందరు అంటున్నారు.

సంజయ్ కాక్ స్వయంగా ఒక కశ్మీరీ పండిత్, ఆయన ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్ కూడా.

"ఈ కథను ఇంతకు ముందెప్పుడూ చెప్పలేదని జనం అంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. బాలీవుడ్‌లో దీనిపై సినిమా తీయలేదన్నది నిజమే. కానీ, బాలీవుడ్‌లో ఇలాంటి కథలపై అసలు సినిమాలే తీయరుగా" అన్నారు.

https://twitter.com/rssurjewala/status/1503685692244692992

దిల్లీలో 1984లో జరిగిన అల్లర్లు, గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లపై కూడా బాలీవుడ్ ఎలాంటి సినిమాలూ తీయలేదు. ఈ దేశంలో ప్రధాన స్రవంతి సినిమాలో చోటు లభించని అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి.

కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ప్రధాని మోదీ ప్రసంగాన్ని రీట్వీట్ చేస్తూ ఒక కామెంట్ పెట్టారు.

"తమ హక్కులు డిమాండ్ చేస్తూ రైతులు, ఉద్యోగాలు కోరూతూ యువకులు ఎన్నో దారుణాలు భరించిన సమయంలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎక్కడికి వెళ్లింది" అన్నారు.

మోదీతో సినిమా డైరెక్టర్ ఫొటో వైరల్

కశ్మీర్ ఫైల్స్ మార్చి 11న రిలీజైంది. మార్చి 12న ఆ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రధాని నరేంద్ర మోదీతో తీసుకున్న ఒక ఫొటో వైరల్ అయ్యింది.

"ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం లభించింది. ముఖ్యంగా #TheKashmirFiles సినిమాకు ఆయన ప్రశంసలు లభించాయి. ధన్యవాదాలు మోదీజీ" అని నరేంద్ర మోదీతో ఉన్న ఒక ఫొటో ఆ సినిమా నిర్మాత అభిషేక్ అగ్రవాల్ షేర్ చేశారు.

https://twitter.com/AbhishekOfficl/status/1502659234319667201

అభిషేక్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన అగ్నిహోత్రి, "మీరు చేసిన పనికి నేను చాలా సంతోషంగా ఉన్నా అభిషేక్, మీరు భారత్‌లో అత్యంత సవాలుగా నిలిచిన నిజాన్ని ప్రొడ్యూస్ చేసే సాహసం చూపించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచం మూడ్ మారుతోంది అనే విషయాన్ని #TheKashmirFiles అమెరికాలో స్క్రీనింగ్ కావడం నిరూపిస్తోంది" అని కామెంట్ చేశారు.

ఈ ఫొటో వైరల్ అయ్యాక చాలా స్పందనలు వచ్చాయి. కొంతమంది ఈ సినిమా తీసిన వివేక్ అగ్నిహోత్రిని ప్రశంసించారు. మరికొందరు దీనిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని అపీల్ చేశారు.

https://twitter.com/vivekagnihotri/status/1495632506363822086

డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఏమంటున్నారు...

సినిమా గురించి చాలా రకాల వివాదాలు వస్తున్నాయి. కొంతమంది సినిమాకు సరైన ప్రమోషన్‌ వేదిక కల్పించలేదని అన్నారు.

సినిమా డైరెక్టర్ మాత్రం, "చూడండి సినిమాకు ప్రమోషన్ అవసరమనుకుంటే నేనే స్వయంగా కాల్ చేసేవాడిని, కానీ, నాకు ఆ అవసరం లేదు. నేను అందుకోసం వెళ్లలేదు. ప్రమోషన్ ఎందుకు చేసుకోవని చాలా మంది నన్ను అడుగుతుంటారు. అయితే, నాకు మార్కెట్ డైనమిక్స్ తెలుసు. కశ్మీర్ పేరుతో చాలా మంది చాలా మాట్లాడారు, చేశారు. చాలా సినిమాలు కూడా వచ్చాయి. అందుకే, కశ్మీర్ కోసం ప్రజల గుండె కొట్టుకుంటుందనే నమ్మకం నాకుంది" అన్నారు.

"ఈ సినిమాలో అసలైన స్టార్ కశ్మీరే అని నేను మొదటి నుంచీ నమ్మాను. కశ్మీర్ గురించి రాత్రింబవళ్లూ తపన పడే వారికి ఈ సినిమాలో ఎవరు స్టారో, ఎవరు కాదో తెలిసిపోతుంది" అని కూడా వివేక్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The KashmirFiles: 'Why worry if it shows the truth' - Prime Minister Modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X