విజయ్ వ్యూహం: ఇక ఎవరి దయాదాక్షిణ్యాలు వద్దు! సొంతంగానే..
తమిళనాడు రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ (మ్యాజిక్ ఫిగర్) రాకపోవడంతో ఏర్పడిన సంక్షోభాన్ని.. టీవీకే అధినేత విజయ్ తనకినుకూలంగా మార్చుకుంటున్నారు. శాసనసభలో జరిగిన నమ్మక పరీక్షలో 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ప్రస్తుతానికి గట్టెక్కినప్పటికీ, ఇతర పార్టీల దయాదాక్షిణ్యాలు లేదా నియంత్రణ లేకుండా సొంతంగానే 'మ్యాజిక్ ఫిగర్' దాటాలని విజయ్ సరికొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపారు.
కూటమి పార్టీల అధిపత్యానికి చెక్ పెడుతూ, కేవలం తమ సొంత 'విజిల్' గుర్తుపైనే పూర్తి మెజారిటీ సాధించి స్థిరమైన, స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికల్లో వారిని టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దించి గెలిపించుకునే 'మాస్టర్ ప్లాన్' అమలువుతోంది.

అసెంబ్లీలో '144' బలం.. వెనుక అసలు సమీకరణాలు
ఇటీవలి బలా నిరూపణలో టీవీకేకు అటు డీఎంకే కూటమి నుంచి, ఇటు అన్నాడీఎంకే చీలిక వర్గం నుంచి అనూహ్య మద్దతు లభించింది. రాష్ట్రంలో బీజేపీ అనుబంధ శ్రేణులు పుంజుకోకూడదనే వ్యూహంతో డీఎంకే కూటమిలోని వీసీకే, ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఎం పార్టీలు తమకున్న 8 సీట్లను టీవీకేకు మద్దతుగా ఇచ్చాయి. దీనికి కాంగ్రెస్ (5), ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు తోడవడంతో ఓటింగ్‌కు ముందే టీవీకే బలం 119 కి చేరింది. అయితే, ఓటింగ్ సమయంలో అన్నాడీఎంకే చీలిక వర్గం నుండి ఊహించని విధంగా మరో 25 ఓట్లు పడటంతో ఈ సంఖ్య ఏకంగా 144కు చేరింది. దీనివల్ల రాబోయే ఆరు నెలల వరకు విజయ్ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
కూటముల నియంత్రణను తెంచుకునేందుకే..
ప్రస్తుతం బయటి నుంచి మద్దతు ఇస్తున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అంతర్గత సంభాషణల్లో "అధికారంలో ఉంది మన ప్రభుత్వమే" అని వ్యాఖ్యానించడం, విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని అనడం టీవీకే శ్రేణులకు మింగుడుపడటం లేదు. మరోవైపు మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే చీలిక వర్గంలోని కొందరు మంత్రి పదవులు ఆశించినా, మంత్రివర్గ విస్తరణలో వారికి చోటు దక్కలేదు. కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకే మంత్రి పదవులు దక్కడంతో అన్నాడీఎంకే చీలిక శ్రేణుల్లో అసంతృప్తి మొదలైంది. ఈ పరిణామాలను గమనించిన విజయ్.. ఇతరుల చేతిలో కీలుబొమ్మగా మారడం కంటే సొంతంగా పుంజుకోవడమే లీలని భావించారు.
రాజీనామాల వ్యూహం.. 'లక్ష' ఓట్ల లెక్కలు
తమపై ఉన్న డీఎంకే ఒత్తిడిని తగ్గించుకునేందుకు అన్నాడీఎంకే చీలిక ఎమ్మెల్యేల అసంతృప్తిని విజయ్ అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ పార్టీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలనే కఠినమైన షరతును ఆయన విధించారు. దీనికి అంగీకరిస్తూ ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకే తీర్థం పుచ్చుకోగా, మరికొందరు అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే ఒంటరిగా గెలిచేందుకు బలమైన సమీకరణాలు కనిపిస్తున్నాయి..
- తిరుచ్చి ఈస్ట్: గత ఎన్నికల్లోనే విజయ్ ఇక్కడ డీఎంకేపై 27 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు అన్నాడీఎంకే ఓట్లు కూడా తోడైతే ఇక్కడ టీవీకే బలం అవలీలగా లక్ష ఓట్లు దాటుతుందని అంచనా.
- మదురాంతకం (ఎస్సీ): ఇక్కడ గతంలో గెలిచిన మరకతం కుమరవేల్ ఓట్లు, టీవీకే అభ్యర్థి ఓట్లు కలిపితే దాదాపు 1.31 లక్షల ఓట్ల బలముంది.
- అంబాసముద్రం: ఇసక్కి సుబ్బయ్య గెలిచిన ఈ స్థానంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన పార్టీల శ్రేణులు ఇప్పుడు టీవీకే వైపు ఉండటంతో ఇక్కడ లక్షన్నర ఓట్ల భారీ ఆధిక్యత లభించే అవకాశం ఉంది.
- ధారాపురం & పెరుందురై: ధారాపురంలో సత్యభామ సాధించిన ఓట్లు, టీవీకే ఓట్లు కలిపితే 1.27 లక్షలు దాటుతుండగా.. పెరుందురైలో జయకుమార్, టీవీకే అరుణాచలం ఓట్లు కలిపి 1.29 లక్షలకు పైగా ఓట్ల బలం చేకూరనుంది.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న, రాజీనామాలు చేయబోతున్న స్థానాలన్నింటిలోనూ 'విజిల్' గుర్తుపై గెలిచి, ఇతరుల మద్దతు అవసరం లేని విధంగా 118 స్థానాల సొంత మేజిక్ ఫిగర్‌ను దాటాలన్నదే విజయ్ ప్రధాన లక్ష్యం. ఈ వ్యూహం గనుక పక్కాగా అమలుకాగలిగితే.. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడటంతో పాటు, డీఎంకే, అన్నాడీఎంకేల సంప్రదాయ రాజకీయ ఆధిపత్యానికి పూర్తిగా గండిపడే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications