తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేసిన వైద్యశాఖ - ప్రెస్ రివ్యూ
తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారని, రాష్ట్రానికి 260 నుంచి 270 టన్నుల ఆక్సిజన్, అవసరమైతే 400 టన్నులకు పైగా లభ్యత ఉందని తెలిపినట్లు ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పూర్తిస్థాయిలో నిల్వ ఉందని చెప్పారు. కొన్ని చిన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇబ్బంది ఎదురవుతున్నా ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల్లో ఆక్సిజన్ కొరత లేకుండా కలెక్టర్లు, డీఎంహెచ్‌ఓలు దృష్టిసారించారని తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలోనే సీఎం కేసీఆర్ ఇక్కడ వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారని చెప్పారు.
ప్రాణవాయువు లభ్యత, మానవ వనరులు, కరోనా రోగులకు ఇచ్చే కిట్‌లు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను సిద్ధం చేసుకోవడంపై ముందే దృష్టి సారించామన్నారు.
సీఎం స్వయంగా ఫార్మా కంపెనీలతో చర్చించడంతో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు సమీకరించుకున్నామని, నాలుగు లక్షల ఇంజక్షన్లు మొదట కొన్న రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు.
ఒక ఐఏఎస్ అధికారి ఆక్సిజన్ లభ్యతపైనా, మరో ఐఏఎస్ అధికారి ఆక్సిజన్ పంపిణీపైనా పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు.
22 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వ సదుపాయాలు ఏర్పాటుచేశామని చెప్పారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు 10,000 ఉన్నాయన్నారు. ప్రస్తుతం కేసుల్లో తీవ్ర పెరుగుదల లేదని ఈటల చెప్పారు.
ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుములనే వసూలు చేయాలని మరోసారి స్పష్టంచేశారు. కరోనా రోగి మృతి చెందినా బిల్లు చెల్లించకుంటే శవాన్ని ఇవ్వబోమని చెప్పడం దారుణమని మంత్రి అన్నారని ఈ వార్తలో రాశారు.
- కరోనావైరస్: అన్ని రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత ఉన్నా కేరళలో ఎందుకు లేదు
- గాంధీ హాస్పిటల్‌కు చేతులెత్తి దండం పెట్టిన ఓ మహిళ... ఆ వైరల్ ఫోటో వెనుక అసలు కథ
'లాక్‌డౌన్ వల్ల ఏ లాభం ఉండదు'.. జగన్
లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రభుత్వానికీ, సామాన్యప్రజలకూ తీవ్ర ఆర్థిక నష్టం తప్పదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.
''లాక్‌డౌన్‌వల్ల ప్రభుత్వానికి రూపాయి నష్టం కలిగితే, సామాన్యుడు నాలుగు రూపాయలు కోల్పోతాడు. గతేడాది ప్రభుత్వానికి దాదాపు రూ.20,000 కోట్ల నష్టం వాటిల్లింది. అంటే .. సామాన్యులు దాదాపు రూ.80,000 కోట్లు నష్టపోయినట్టే’’నని ఆయన వ్యాఖ్యానించారు.
కొవిడ్ సెకండ్‌వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వచ్చే కొన్నినెలలపాటు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు.
కొవిడ్, ఉపాధిహామీ పనుల కింద లేబర్ బడ్జెట్, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్కులు, ఏఎంసీయూ, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలు, వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్కులు, 90 రోజుల్లో ఇంటిస్థలం కేటాయింపు, స్పందన కార్యక్రమం సమస్యల పరిష్కారం వంటి అంశాలు సహా.... ఏప్రిల్ , మే నెలల్లో అమలు చేయనున్న పథకాలపై సీఎం సమీక్షించారు.
కరోనా నియంత్రణలో భాగంగా ఏడుకోట్ల వ్యాక్సీన్ల ఉత్పత్తి జరుగుతోందని, అందులో కొవాగ్జిన్ కోటి డోసులు కాగా .. మిగతావి కొవిషీల్డ్ ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకు వచ్చారు.
రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడ్డవారిలో ఇప్పటివరకూ 11.30 లక్షలమందికి రెండు డోసు, దాదాపు 45.48 లక్షలమందికి తొలి డోసు ఇచ్చామని వివరించారు.
రాష్ట్రంలో 18-45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు.
104 కాల్ సెంటర్ పూర్తిస్థాయిలో సమర్థవంతంగా పనిచేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.
104 నంబరుకు ఫోన్‌చేసేవారికి తక్షణమే పరిష్కారం చూపాలనీ, ఆస్పత్రికి వెళ్లడమా? హోం క్వారంటైన్‌కు పంపడమా? హోం ఐసొలేషన్‌లో ఉంచడమా అనే అంశాలపై స్పష్టతను ఇవ్వాలని చెప్పారు.
104 కాల్ సెంటర్‌కు వైద్యులు అందుబాటులో ఉండాలనీ, దానిని వన్ సెంటర్ సొల్యూషన్‌గా మలచాలని కోరారు.
కరోనానియంత్రణ బాధ్యత జాయింట్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలోని ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్సను సమీక్షించాలని, కొవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్రంలో 59 సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, రోజూ 320-340 టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోందని అధికారులు తెలపగా, అవసరమైనవారందరికీ ఆక్సిజన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
ఎక్కడా ఆర్థిక కార్యక్రమాలు ఆగరాదన్నారు. కొవిడ్‌పై వదంతులు సృష్టించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అరెస్టులు చేయాలని ఆదేశించారని ఈ కథనంలో తెలిపారు.
- ఏపీ: శ్మశానాల్లో ఖాళీ లేదు.. ప్రభుత్వ లెక్కల్లో తప్పులేదంటున్నారు.. మరి పెరిగిన మృతదేహాలు ఎక్కడివి?
- కోవిడ్: రోగుల ఆర్తనాదాల మధ్య నిర్విరామంగా పనిచేస్తూ అలసిపోతున్న డాక్టర్లు

సైబర్ మోసాలపై ఫిర్యాదులకు 155260కు కాల్ చేయాలి
సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. అందుకే బాధితులకు సకాలంలో సాయం అందించేందుకు 24 గంటలపాటు పోలీస్ కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. సైబర్ నేరాలకు సంబంధించిన ఏ ఫిర్యాదు అయినా.. ఏ సమయంలోనైనా 155260 నంబర్‌కు కాల్ చేయవచ్చు. వెంటనే పోలీసుల నుంచి తగిన సాయం అందుతుందని నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.
ఆన్‌లైన్ మోసగాళ్లు మన డబ్బులు కొట్టేసినట్టు తెలిసిన 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు.
ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేస్ (ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీ ఎం వంటి) ద్వారా జరిపే లావాదేవీల్లో మన బ్యాంకు నుంచి డబ్బు అవతలి ఖాతాకు జమయ్యేందుకు 24 గంటల సమయం ఉంటుంది.
ఆ లోపు మనం హెల్ప్‌లైన్ కాల్‌చేసి ఫిర్యాదు చేయాలి. ఆ వెంటనే సైబర్ క్రైం పోలీసులు సమాచారాన్ని మన బ్యాంకుశాఖతో పాటు అవతలి కంపెనీకి పంపుతారు.
అది ఫ్రాడ్ ట్రాన్‌జాంక్షన్ అని నిర్ధారించుకుంటే మన డబ్బులు మనకు వాపస్ వస్తాయి. ఇదంతా 24 గంటలలోపే జరగాలి. లేదంటే దర్యాప్తులో చిక్కులు తప్పవు.
సైబర్ నేరాల కట్టడిలో భాగంగా కేంద్ర హోం శాఖ, ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ల ఆధ్వర్యంలో ఈ హెల్ప్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
ప్రతి రాష్ట్ర పోలీస్ శాఖకు దీనిలో ఒక డ్యాష్‌బోర్డు ఉంటుంది. దీని ద్వారా ఆయా రాష్ట్రాల పరిధిలోని బాధితులు 155260కు డయల్ చేయగానే స్పందించేలా తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగంలో ఓ ప్రత్యేక విభాగం ఇందుకోసం పనిచేస్తుంది.
24 గంటలపాటు సిబ్బంది ఈ కాల్ సెంటర్‌లో అందుబాటులో ఉంటారు. ఆన్‌లైన్‌లో మోసాలు, డబ్బులు కొట్టేయడం, ఆన్‌లైన్ వేధింపులు ఇలా ఏదైనా కాల్ సెంటర్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
నేరుగా సెంట్రల్ సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు నమోదవుతుంది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదును ఎలా నమోదు చేయాలి, వారి పరిధిలోని సైబర్ నేరాల దర్యాప్తు అధికారుల ఫోన్ నంబర్లు ఇలా అన్ని రకాల సమాచారం బాధితులకు అందిస్తున్నట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా రోజూ 25 నుంచి 30 వరకు ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారని ఈ కథనంలో తెలిపారు.
బస్సుల్లో గరిష్టంగా 50 శాతమే ప్రయాణించాలి-ఏపీఎస్ ఆర్టీసీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం మార్గదర్శకాలను ఆర్టీసీ అమల్లోకి తీసుకువచ్చిందని, బస్సుల్లో గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే మంగళవారం నుంచి అనుమతిస్తోందని సాక్షి కథనంలో రాశారు.
మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఈ నెలలో రోజుకు సగటున 57 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది.
సోమవారం ఆక్యుపెన్సీ రేటు 50 శాతానికే పరిమితమైంది. దాంతో ఆర్టీసీ ఆదాయంపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. సగటున రోజుకు రూ.14 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.7 కోట్లే వస్తోంది.
దాంతో ఆర్టీసీ తమ బస్సు సర్వీసులను తగ్గించింది. డిమాండ్ అంతగాలేని రూట్లలో సర్వీసుల్లో కోత విధించింది.
రాష్ట్రంలో ఆర్టీసీ రోజూ 10,553 షెడ్యూళ్లలో బస్సు సర్వీసులు నిర్వహించాలి. కానీ వాటిలో 25 శాతం సర్వీసులను తగ్గించింది.
ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్లు, కార్యాలయాల్లో కూడా కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారని ఈ వార్తలో రాశారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ లక్షణాలున్నా పరీక్షల్లో నెగెటివ్ ఎందుకు వస్తోంది... అలాంటప్పుడు ఏం చేయాలి?
- కోవిడ్: ఆంధ్రా నుంచి వస్తున్నారా... అయితే నో ఎంట్రీ - పొరుగు రాష్ట్రాల భయాలకు కారణమేంటి?
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- ఆక్సిజన్ అందక దిల్లీలో 20 మంది.. అమృత్‌సర్‌లో ఆరుగురు మృతి..
- జస్టిస్ ఎన్వీ రమణ ఎవరు? న్యాయమూర్తుల హక్కులపై ఆయన అభిప్రాయం ఏమిటి
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల 'డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications