బెంగళూరులో హైఅలర్ట్: బంద్ లేదు, పుకార్లు నమ్మద్దు
బెంగళూరు: కావేరీ జలాల పంపిణి విషయంలో మళ్లీ అల్లర్లు జరిగే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు నగరంలో ఈనెల 25వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
సోమవారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలో కావేరీ మానటరింగ్ కమిటి సమావేశం ప్రారంభం అయ్యింది. కేంద్ర జనవనురుల శాఖ ప్రధాన కార్యదర్శి శశిశేఖర్ నేతృత్వంలో సమావేశం ప్రారంభం అయ్యింది. కర్ణాటక, తమిళనాడు,. కేరళ, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరైనారు.
కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ జాధవ్ ఈ సమావేశానికి హాజరైనారు. కావేరీ జలాలతో పాటు కర్ణాటకలో నీటి సమస్యగురించి ఇదే సందర్బంలో చర్చకురానుంది. సోమవారం జరిగే సమావేశంలో కర్ణాటకకు న్యాయం జరుగుతుందని అందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

కావేరీ జలాల పంపిణి విషయంలో సోమ, మంగళవారం ఏ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వస్తుందో అని తెలియకపోవడంతో బెంగళూరు నగర పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బెంగళూరులోని సున్నితమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సోమ, మంగళవారం బెంగళూరులో బంద్ ఉండదని, పుకార్లు నమ్మరాదని పోలీసు అధికారులు సోషల్ మీడియాలో మనవి చేశారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications