
రిటైర్మెంట్ టైమ్‌లో మరోసారి సీజేఐ ఎన్వీ రమణ ఘాటు వ్యాఖ్యలు: నిన్న ప్రధాని సమక్షంలో..ఇవ్వాళ
న్యూ రాయ్‌పూర్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవ్వాళ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తోన్నారు. న్యూ రాయ్‌పూర్‌లోని హిదయతుల్లా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కన్వొకేషన్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. న్యాయ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందనే విషయాన్ని పునరుద్ఘాటించారు.

నిన్న ప్రధాని సమక్షంలో..
శనివారం నాడు దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన అఖిల భారత జిల్లా న్యాయ సేవా అథారిటీ సదస్సులో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థను ప్రతి ఇంటి గడపకూ చేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనీ పేర్కొన్నారు.

అది బాధాకరం..
ఇవ్వాళ కూడా ఈ కన్వొకేషన్‌లో తన అభిప్రాయాలను ఆయన ముక్కుసూటిగా వెల్లడించారు. ఆధునిక స్వతంత్ర భారతదేశ ఆకాంక్షలను నిర్వచించే సుప్రీం డాక్యుమెంట్ (రాజ్యాంగం) అనేది ఇవ్వాళ న్యాయ విద్యార్థులు, లీగల్ ప్రాక్టీషనర్లు, కొంతమంది ప్రజలకు మాత్రమే పరిమితం కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అనేది ప్రతి పౌరుడి మనోభావాలను ప్రస్ఫూటింపజేస్తుందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడికీ ఉందని చెప్పారు.

వాడుక భాషలో రాజ్యాంగంపై అవగాహన..
రాజ్యాంగంపై వాడుక భాషలో ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కల్పించాల్సిన బాధ్యత యువ న్యాయవాదులపై ఉందని సీజేఐ గుర్తు చేశారు. ప్రతి పౌరుడు తమ హక్కులు, బాధ్యతలను గుర్తించినప్పుడే రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లభించినట్టవుతుందని పేర్కొన్నారు. న్యాయ విద్య అనేది సామాజిక ఇంజినీర్లను తయారు చేసేదిగా ఉండాలని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. సామాజిక మార్పులను తీసుకుని రాగల శక్తి సామర్థ్యాలు న్యాయవ్యవస్థకు ఉన్నాయని పేర్కొన్నారు.

ఆయన అదే చేశారు..
మానవ హక్కుల ఉల్లంఘన తరచూ చోటు చేసుకుంటోందని, ఈ విషయంలో అణగారిన వర్గాలే పీడితులవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువ న్యాయవాదులు జనంలోకి చొచ్చుకెళ్లాలని హితబోధ చేశారు. న్యాయ సేవలను ప్రజల ముంగిట్లోకి చేర్చాలని సూచించారు. జస్టిస్ హిదయతుల్లా అదే చేశారని పేర్కొన్నారు. న్యాయం కోసం తన వద్దకు వచ్చిన కేసుల్లో ప్రతి మూడింటినీ ఉచితంగా వాదించేవారని చెప్పారు. చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజల్లో చెక్కు చెదరని విశ్వాసాన్ని కల్పించడంలో జస్టిస్ హిదయతుల్లా కీలకపాత్ర పోషించారని అన్నారు.

తొలి తరం న్యాయవాదులు..
తొలి తరం న్యాయవాదులు.. తమ కేరీర్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని, దీనికోసం వారు అహర్నిశలు కష్టపడ్డారని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు. ఒక న్యాయవాది తప్పనిసరిగా ఆల్‌రౌండర్‌గా ఎదగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అన్ని రంగాల పట్లా సమగ్ర అవగాహనను పెంపొందించుకోవాలని, ఏదో ఒక్క విభాగానికే పరిమితం కావడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు. అది కేరీర్‌కు దోహదపడదని వ్యాఖ్యానించారు. వ్యాపారం, క్రీడలు.. ఇలా అన్ని విభిన్న అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి అన్నారు.