కుంభమేళాలో అమృత స్నానాలకు చివరి ముహూర్తం..!!
Maha Kumbhmela 2025: కుంభమేళాలో జనం పోటెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే 40 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళా కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు.. బస్సులు ఏర్పాటు చేసారు. మహాశివరాత్రితో కుంభమేళా ముగియనుంది. దాదాపు 50 కోట్లకు భక్తుల సంఖ్య చివరి రోజుకు చేరుకునే అవకాశం ఉంది. కాగా, పుణ్యస్నానాలకు మాత్రం రెండు ముహూర్తాలే మిగిలి ఉన్నాయి. ఈ రెండు ముహూర్తాల వేళ భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే కుంభమేళాలో నాలుగు రాజ స్నానాలు పూర్తయ్యాయి. భోగి, మకర సంక్రాంతి, పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరిం చారు. మరో రెండు పుణ్యస్నానాల ముహూర్తాల తో కుంభమేళా పూర్తి కానుంది. అయిదో రాజ స్నానం మాఘ పూర్ణిమ రోజున సాగనుంది. ఈ నెల 12వ తేదీన మాఘ పూర్ణిమ. ఆ రోజు స్నానం కోసం ఇప్పటికే కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ కు బయల్దేరారు. మాఘ పూర్ణిమ రోజున స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 06.55 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 07.22 గంటల వరకు ఉంటుంది. కాగా , 12వ తేదీ ఉదయం స్నానాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే విధంగా మాఘ పూర్ణిమ తర్వాత మరో రాజ స్నానాన్ని మహా శివరాత్రి నాడు చేస్తారు.
శివరాత్రితోనే కుంభమేళా పూర్తవుతుంది. దీంతో..ఈ చివరి రెండు పవిత్ర స్నానాలకు ముఖ్యమైన ముహూర్తాలు గా భావిస్తుండటంతో దీనికి అనుగుణంగా యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అదే విధంగా మహా శివరాత్రితో కుంభమేళా ముగియనుండటంతో రాజకీయ ప్రముఖులు సైతం పెద్ద సంఖ్యలో ప్రయాగ్ రాజ్ కు తరలి వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications