రెండో భార్య కేసులో మాజీ సీఎంకు బిగ్ రిలీఫ్, ఎన్నికల అఫిడవిట్ లో అలా, కోర్టులో జరిగింది ఇలా !
బెంగళూరు: దీపావళి పండుగ సందర్భంగా జేడీఎస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ఓ శుభవార్త అందింది. తనపై ఉన్న కేసు నుంచి కుమారస్వామికి ఊరట లభించడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఎన్నికల అధికారులకు తప్పుడు సమాచారం అందించారని ఫిర్యాదు నమోదైంది.
ఇప్పుడు ఈ కేసు ఫిర్యాదును కొట్టివేయాలని బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామిపై ఎస్.ఆనంద్ అనే వ్యక్తి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. ఆనంద్ చేసిన ఫిర్యాదును కోర్టు కొట్టివేయడంతో మాజీ సీఎం కమారస్వామి ఊపిరిపీల్చుకున్నారు.

కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆయన రెండో భార్య వివరాలు, ఆమె పిల్లల సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచలేదని, ఆయన రెండో భార్య ఫ్యామిలీ గురించి ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆనంద్ అతని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం మొదటి భార్య జీవించి ఉన్నంత కాలం రెండో పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదని కోర్టు తీర్పునిచ్చింది.
అలాగే ఎన్నికల లేఖలో పిల్లల సమాచారం ఇవ్వాలనే రూల్ కూడా లేదని కోర్టు స్పష్టం చేసింది. అందుకే ఈ కేసులో మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ప్రజాప్రాతినిధుల చట్టంలోని సెక్షన్ 125ఎ ఉల్లంఘించలేదంటూ ఆనంద్ ఫిర్యాదును కోర్టు రద్దు చేసిందని ప్రముఖ కన్నడ టీవీ చానల్ వార్తను ప్రసారం చేసింది. మొత్తం మీద కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఇంతకాలం ఎదుర్కొంటున్న ఆరోపణల కేసు కొట్టివేయడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications