వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబాన్‌లు ఇకపై భారత్ దృష్టిలో తీవ్రవాదులు కారా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తాలిబాన్ పట్ల భారత్ వైఖరి

తాలిబాన్‌ల పట్ల భారత్ వైఖరి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఖతర్ రాజధాని దోహాలోని భారత రాయబారి దీపక్ మిత్తల్, తాలిబాన్ రాజకీయ కార్యాలయ అధ్యక్షుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్‌ను కలిశారని మంగళవారం సాయంత్రం భారత విదేశీ వ్యవహారాల శాఖ చెప్పింది.

అయితే, భారత్, తాలిబాన్ నేతల మధ్య గత కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుగుతున్నాయని చాలా మంది చెబుతున్నారు. తాలిబాన్‌‌లతో చర్చలు జరిపినట్లు భారత్ అధికారికంగా అంగీకరించడం ఇదే మొదటిసారి. కానీ, తాలిబాన్‌ల అభ్యర్థన మేరకే ఈ చర్చలు జరిగాయని భారత్ చెప్పింది.

తాలిబాన్‌ల నుంచి అభ్యర్థన రావడం, దానికి భారత్ అంగీకరించడం అనేది ఒక మారిన వైఖరిలాగే కనిపిస్తోందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. అయితే, తాలిబాన్‌ల విషయంలో భారత్ అప్రమత్తంగా కూడా ఉందని చెబుతున్నారు.

అఫ్గానిస్తాన్‌లో భారతీయుల భద్రత, వారు అక్కడ నుంచి తిరిగి రావడం గురించి తాలిబాన్‌‌లతో చర్చించామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో చెప్పింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించకుండా ఉండేలా చూసుకోవాలని దీపక్ మిత్తల్ తాలిబాన్ ప్రతినిధిని కోరారని తెలిపింది. .

కాబుల్‌లో ఇంకా 140 మంది భారతీయులు చిక్కుకుపోయి ఉన్నారు. వారిని తిరిగి తీసుకురావాల్సి ఉంది. భారత్ ఇప్పటికే 565 మందిని అఫ్గానిస్తాన్ నుంచి తీసుకొచ్చింది. వీరిలో 112 మంది అఫ్గాన్ పౌరులు కూడా ఉన్నారు.

తాలిబాన్ పట్ల భారత్ వైఖరి

భారత్‌కు తాలిబాన్ భరోసా

అన్ని అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని తాలిబాన్ ప్రతినిధి భారత్‌కు భరోసా ఇచ్చినట్లు విదేశాంగ శాఖ చెప్పింది. భారత రాయబారి దోహాలో కలిసిన తాలిబాన్ ప్రతినిధి షేర్ మొహమ్మద్ అబ్బాస్ దెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందారు. అఫ్గానిస్తాన్‌తో భారత్ రాజకీయ, వాణిజ్య సంబంధాలు కొనసాగించాలని ఆయన అన్నారు.

ఇంతకు ముందు భారత్ తాలిబాన్‌ను ఒక తీవ్రవాద గ్రూపుగా భావించేది. ముఖ్యంగా హక్కానీ గ్రూప్ గురించి భారత్ ఆందోళనకు గురయ్యేది. ఇది తాలిబాన్‌లో భాగం. 2008-09లో భారత రాయబార కార్యాలయంపై దాడికి తాలిబాన్ ఉప నేత సిరాజుద్దీన్ హక్కానీనే కారణమని భారత్ భావించింది.

గత కొన్ని నెలలుగా అఫ్గానిస్తాన్‌లో చాలా గ్రూపులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత్ చెప్పింది. కానీ, అఫ్గానిస్తాన్‌లో బలప్రయోగంతో దక్కించుకున్న అధికారాన్ని భారత్ అంగీకరించడం జరగదని అంతకు ముందు విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు.

తాలిబాన్ అఫ్గానిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకోవడంతో భారత్ అక్కడ తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించింది. కానీ, 'ద హిందూ’లో ప్రచురితమైన రిపోర్టుల ప్రకారం తాలిబాన్‌లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత కూడా భారత్ కాబుల్‌తో రాజకీయ సంబంధాలు తెంచుకోలేదు.

మరోవైపు, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం అఫ్గానిస్తాన్-భారత్ సంబంధాల గురించి మాట్లాడారు.

"అమెరికా ఖతర్‌లోని దోహా నుంచే అఫ్గానిస్తాన్ అంశాలను పరిశీలిస్తుంది. భారత్ కూడా అదే చేయబోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం తాలిబాన్‌‌లతో రాజకీయ చర్చలు ప్రారంభించింది. అక్కడ వారు ప్రభుత్వం ఏర్పాటు చేశాక గుర్తింపు కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది" అన్నారు.

తాలిబాన్ పట్ల భారత్ వైఖరి

తాలిబాన్‌ పట్ల మెత్తబడ్డ భారత్

భారత్ ఆగస్ట్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి అధ్యక్షత వహించింది. అఫ్గానిస్తాన్‌లో ఇదంతా జరిగింది ఆగస్టులోనే. కానీ, ఆ సమయంలో భారత్ తాలిబాన్ మీద ఎలాంటి కఠిన వైఖరీ అవలంబించలేదు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోయినప్పటికీ అఫ్గానిస్తాన్‌పై ఏదైనా తీర్మానం ఆమోదించాలంటే భారత్ సంతకం తప్పనిసరి. ఆ దేశానికి భారత అధ్యక్షతన చివరి రోజు కూడా ఒక తీర్మానం ఆమోదించారు. కానీ, అందులో కూడా తాలిబాన్ గురించి భారత్ అంత దూకుడు చూపించలేదు.

భద్రతామండలి తీర్మానంపై భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, దీనిపై భారత ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం విమర్శలు చేశారు.

బుధవారం ఒక ట్వీట్ చేసిన చిదంబరం అందులో "మంగళవారం యూఎన్ఎస్‌సీ అఫ్గానిస్తాన్‌పై ఆమోదించిన తీర్మానంపై ప్రభుత్వం తనకు తాను అభినందనలు చెప్పుకుంటోంది. ఈ తీర్మానానికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది సమస్యకు పరిష్కారం లభించింది. భారత్‌కు దీనితో సంతృప్తి లభించింది. రెండోది మనం పేపరుపై చెప్పాల్సింది చెప్పి, దానిమీద ఇంకొకరితో సంతకాలు పెట్టించాం. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో మంగళవారం అదే జరిగింది. మనల్ని మనం అభినందించుకోవడం తొందరపాటే అవుతుంది. చైనా, పాకిస్తాన్, తాలిబాన్ నియంత్రిత అఫ్గానిస్తాన్ భారత్‌కు ఆందోళన కలిగించేవి" అన్నారు.

అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ అష్రఫ్ ఘనీ ఇప్పుడు దేశం వదిలి వెళ్లిపోయారు. భారత్ అఫ్గానిస్తాన్‌లోని వివిధ ప్రాజెక్టులపై 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. 9 కోట్ల డాలర్ల వ్యయంతో అఫ్గానిస్తాన్‌ పార్లమెంటు భవనం కూడా నిర్మిస్తోంది. ఆ దేశంలో భారత్‌కు చాలా మంచి పేరు కూడా ఉంది.

తాలిబాన్ పట్ల భారత్ వైఖరి

అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లగొట్టారా

అఫ్గానిస్తాన్‌లోని అభివృద్ధి ప్రాజెక్టుల్లో భారత్ పని చేయని ప్రాంతం అంటూ ఎక్కడా లేదని గత ఏడాది అఫ్గానిస్తాన్ కాన్ఫరెన్స్‌లో విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు. అఫ్గానిస్తాన్‌లోని మొత్తం 34 ప్రావిన్సుల్లో జరిగే అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత్ పనిచేస్తోందని ఆయన అప్పుడు తెలిపారు.

2019-20లో రెండు దేశాల మధ్య 150 కోట్ల డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం ఉండేది. భారత్ తాలిబాన్‌ను పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మగా భావిస్తోంది.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ రాక భారత్‌కు వ్యూహాత్మకంగా ఒక దెబ్బ లాంటిది. భారత్‌ను అఫ్గానిస్తాన్ నుంచి ఒక విధంగా తరిమికొట్టినట్లు కూడా భావిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఆఫ్గానిస్తాన్ ప్రజల మధ్య భారత్‌కు మంచి ఇమేజ్ ఉండేది. కానీ హఠాత్తుగా అది మొత్తం చెదిరిపోయింది.

భారత్ తాలిబాన్‌ను సంప్రదించడం చాలా ఆలస్యం అయ్యిందని కూడా కొందరు భావిస్తున్నారు. తాలిబాన్‌లు దోహాలో 2013లోనే తన రాజకీయ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఖతర్‌తో భారత్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. కానీ, అఫ్గానిస్తాన్‌లో అధికారంలోకి వచ్చాక మాత్రమే భారత్ తాలిబాన్‌తో చర్చలు ప్రారంభించింది.

భారత్ ఆందోళన

భారత్ ఆందోళన ప్రధానంగా పాకిస్తాన్ సైన్యం, అక్కడి నిఘా ఏజెన్సీలతో తాలిబాన్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించే. మరోవైపు, భారత్ తమకు వ్యతిరేకంగా అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటోందని పాకిస్తాన్ గతంలో ఎన్నోసార్లు ఆరోపణలు చేసింది.

ఇప్పుడు తాలిబాన్‌లు పాకిస్తాన్‌ను తమ మరో ఇల్లులా చెబుతున్నారు. చైనా కూడా తాలిబాన్‌కు అండగా నిలిచింది. మరోవైపు అమెరికా అక్కడ నుంచి బయటపడింది. దీంతో ఇప్పుడు భారత్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. భారత్‌లో ఇస్లామిక్ తీవ్రవాదానికి అఫ్గానిస్తాన్ సాయం చేయడం మొదలవుతుందేమోనని బారత్‌ ఆందోళన చెందుతోంది.

1996 నుంచి 2001 వరకూ తాలిబాన్‌లు అఫ్గానిస్తాన్‌లో అధికారంలో ఉన్నప్పుడు అది అంతర్జాతీయంగా ఏకాకిగా మారింది. కానీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా, యూఏఈ అప్పుడు ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇచ్చాయి.

కానీ, ఈసారీ పూర్తిగా భిన్నంగా ఉంది. చైనా, రష్యా , ఇరాన్ తాలిబాన్‌తో కలిసి పనిచేస్తామనే సంకేతాలు ఇచ్చాయి.

తాలిబాన్ ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంలా పనిచేస్తే భారత్ గుర్తింపు ఇవ్వడం మంచిదని గత నెలలో భారత మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

కానీ, భారత్ ఎలాంటి తొందరపాటు చర్యా తీసుకోకూడదని, ప్రస్తుతానికి ప్రేక్షకపాత్ర వహించడమే మంచిదని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. కానీ, భారత్ అఫ్గానిస్తాన్‌ వరకూ చేరుకోవాలంటే, అది ఇప్పుడు తాలిబాన్‌తో సంప్రదింపులు జరపడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉన్నట్లు కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
The Taliban are no longer terrorists in India's view
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X