రాహుల్ సభలో వింత: సభకు వచ్చి, మంచాలు తీసుకెళ్లారు
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా దేవరియా జిల్లా రుద్రాపూర్‌లో 'ఖాట్‌సభ' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో రైతులు కూర్చోవడానికి కుర్చీలకు బదులుగా రెండువేల నులక మంచాలు వేశారు.

మంచాలను తమ వెంట తీసుకెళ్లిపోయిన రైతులు
అయితే ఈ సభకు హాజరైన రైతులంతా సభ అనంతరం ఆ మంచాలను తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఈ దృశ్యాలు మీడియాకు చిక్కడంతో, ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ తన మొదటి సభలోనే ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. మోడీ రైతులను మరిచిపోయారంటూ విమర్శించారు.

మోడీపై విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో మోడీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే రైతుల అభివృద్ధికి తోడ్పడతానని వ్యాఖ్యలు చేసి ఇప్పుడు రైతుల పట్ల నిర్లక్ష్యధోరణి కనబరుస్తున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే రైతులకు సహాయపడతానని చెప్పి, ఇప్పుడు వారిని పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు.

2500 కిలోమీటర్ల మహాయాత్ర
కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ రుద్రాపూర్ నుంచి ఢిల్లీ వరకు 2500 కిలోమీటర్ల మహాయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రను రాహుల్ గాంధీ 30 రోజులు కొనసాగిస్తారు. ఈ మహాయాత్రలో భాగంగా నెల రోజుల పాటు 223 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం నియోజకవర్గాలు 403) రాహుల్ పర్యటిస్తారు.

రైతులతో భేటీ అయి సమస్యలు తెలుసుకుంటారు
రైతులతో భేటీ అయి వారి సమస్యలను తెలుసుకుంటారు. యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలోనూ పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్లి రైతులతో ముచ్చటిస్తారు. రైతుల డిమాండ్లను తెలుసుకుంటారు.












Click it and Unblock the Notifications