రాజకీయంగా ఎదుర్కోలేకే: మేనల్లుడికి ఈడీ సమన్లపై మమతా బెనర్జీ, కేంద్రంపై ఫైర్
కోల్‌కతా: రాజకీయంగా తమతో పోరాటం చేయలేకపోతోందని, అందుకే దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని కేంద్రం, బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. బొగ్గు అక్రమ రవాణా కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సమన్తు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ కేంద్రంపై ఫైరయ్యారు.
తన మేనల్లుడి(అభిషేక్ బెనర్జీ)కి ఈడీ సమన్లు జారీ చేయడంపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ తమకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టడం తమకు తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. తమతో రాజకీయంగా పోరాడాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు.

తమపై ఈడీనీ ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు. తమకు ఎలా తిప్పటికొట్టాలో తెలుసని అన్నారు. ఈ అవినీతి విషయంలో టీఎంసీ వైపు వేలెత్తి చూపడం వల్ల ప్రయోజనం లేదన్నారు. సహజ వనరుల కేటాయింపులు కేంద్రం పరిధిలోని అంశమన్నారు. తమ రాష్ట్రంలో బొగ్గు గనుల్ని దోచుకుంటున్న బీజేపీ నాయకుల సంగతేంటని మమత ప్రశ్నించారు.
అంతేగాక, ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రణాళికను తప్పుబట్టారు మమతా బెనర్జీ. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్మేయాలని చూస్తోందని ఆరోపించారు. రైల్వే, విమానాశ్రయాలు, పీఎస్‌యూలు.. ఇలా అన్నింటినీ అమ్మేయాలనుకుంటోందని మండిపడ్డారు. దేశంలోని మట్టిని కూడా అమ్మగలరా? అని ప్రశ్నించారు మమతా బెనర్జీ.
కాగా, సెప్టెంబర్ ఒకటిన రుజిరా ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా.. అదే నెల 6న ఈడీ అభిషేక్ బెనర్జీని ప్రశ్నించనుంది. దీనిపై అభిషేక్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో తమను బెదిరించవచ్చని వారు(బీజేపీ) అపోహపడుతున్నారని అన్నారు. ఇలాంటి వాటికి బెదరమని వారికి చెప్పాలనుకుంటున్నా.. చేతనైతే త్రిపురలో టీఎంసీనీ అడ్డుకోండి.. అంటూ బీజేపీ, అమిత్ షాకు అభిషేక్ సవాల్ విసిరారు.
ఇది ఇలావుండగా, పశ్చిమబెంగాల్లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసపై వరుసగా కేసులు నమోదు చేస్తున్న సీబీఐ .. శనివారం మరో 10 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది. ఎన్నికల హింస సందర్భంగా తృణూల్ కార్యకర్తలను నిందితులుగా చేరుస్తూ ఈ ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ ఈ వ్యవహారంలో నమోదైన ఎఫ్ఐర్‌ల సంఖ్య 21కు చేరుకుంది. ఎన్నికల తర్వాత హింస కేసుల్లో ఇద్దరు తృణమూల్ కార్యకర్తల్ని తాజాగా సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసలో బాధితులుగా మారిన వారి కుటుంబాల నుంచి వాంగ్మూలాలను కూడా సీబీఐ రికార్డు చేస్తోంది. వీటి ఆధారంగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సీబీఐ, ఈడీ దూకుడుపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు కేంద్రం ఎన్ని కక్షసాధింపులకు దిగినా తాము ధైర్యంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. తనకు ఈడీ పంపిన సమన్లపై ఎలాంటి ఆందోళనకూ గురి కావడం లేదని మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా వెల్లడించారు. వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.












Click it and Unblock the Notifications